Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 28, 29 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
- సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్లో ఎ.కె. పద్మనాభన్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రజల మేలు కోసమేనని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎకె పద్మనాభన్ అన్నారు. ఆ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోక పోతే కార్మికవర్గ ఆగ్రహాన్ని మరోసారి చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మె అవశ్యకతను, ధరల పెరుగుదల వల్ల ఎదురవుతున్న సమస్యలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కార్మికకోడ్ల వల్ల తలెత్తబోతున్న ప్రమాదాలను క్షేత్ర స్థాయిలో కార్మిక వర్గానికి వివరించాలని పిలుపునిచ్చారు. ఐక్య పోరాటాల ద్వారానే కేంద్రం విధానాలను తిప్పికొట్టగలుగుతామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా పద్మనాభన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కరోనా కాలాన్ని బంగారు అవకాశంగా ఉపయోగించుకుని కార్పొరేట్లకు అనుకూల విధానాలను అవలంభిస్తూ ప్రజలపై భారం మోపిన తీరును వివరించారు. డీమానిటైజేషన్,నేషనల్ మానిటైజేషన్ పైపులైన్లతో దేశ ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నదని విమర్శించారు. ఈ సందర్భంలో గత రెండేండ్లుగా రైతాంగం, కార్మిక వర్గం, మైనార్టీలు, దళితులు, మహిళలు, విద్యార్థులు మోడీ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు నిరసనగా గతంలో 19 హర్తాళ్లను నిర్వహించామనీ, 2020లో రెండు హర్తాళ్లను జరిపామని గుర్తుచేశారు. కార్మికవర్గం ఐక్యంగా పోరాడకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి మొదలైన ప్రజా అవసరాలకు తగిన రీతిలో కేటాయింపులు చేయలేదన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలకంటే కార్పొరేట్ల ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అర్థమవుతున్నదని వివరించారు. స్వాతంత్రానంతర కాలంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పారు. మరోవైపు అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంక్షోభం కారణంగా మూతపడ్డాయనీ, దీంతో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజ వేతనాలు పడిపోయాయని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ లేదన్నారు. కార్మికులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించకుండా కులం, మతం, ప్రాంతం తదితర అంశాలను తెర మీదకు తెచ్చి వారి మధ్య ఘర్షణలు సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పారు.ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల సందర్భంగా కర్నాటకలో మతచిచ్చు రేపేందుకు కుట్ర చేస్తున్నదని తెలిపారు. మోడీ ఎన్ని హెచ్చులు పోయినా..చివరికి మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇది కార్మిక, కర్షక ఐక్యత ఫలితమేనని తెలిపారు. నికరంగా నిలబడి పోరాడిన రైతాంగ విజయం తర్వాత కార్మిక వర్గం మరింత పట్టుదలగా పోరాడాల్సిన అవశ్యకత ఉందన్నారు. అన్ని స్థాయిల్లోని సీఐటీయూ కమిటీలు సమ్మె జయప్రదం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటాన్ని శక్తివంతంగా నడపాలన్నారు. ఐక్యఉద్యమాల కోసం ముందు పీరిన నిలవాలని కోరారు.Ä