Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రభుత్వం పేద విద్యార్థులందరికీ విద్యను అందుబాటులోకి తేవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ పౌర స్పందన వేదిక ప్రాంతీయ కమిటీ ఆవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెరుగైన వైద్యం అందేలా ప్రతి మండలకేంద్రంలో ఆస్పత్రిని నెలకొల్పి, వైద్యులను నియమించాలని కోరారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు గౌరవవేతనం నెలకు రూ.5000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో పౌరస్పందన వేదిక పనిచేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సమావేశంలో పౌరస్పందన వేదిక సూర్యాపేట నూతన ప్రాంతీయ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జె. నర్సింహారావు, కార్యదర్శి కృపాకర్, కోశాధికారి ఎం.అరుణ్జ్యోతి, ఉపాధ్యక్షులు ఎస్.వెంకటరెడ్డి, బి.జానయ్య, కార్యదర్శులుగా వీరబోయిన రవి, షేక్ నజీర్, రాఘవులు, అంజయ్యలతో పాటు 25 మందితో నూతన కమిటీని నియమించారు.