Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో వ్యవహరించే విధానం ఏమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ అధికార పరిధిలోకి రాకుండా జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేసే పద్ధతిని పోలీసులు ఎలా అనుసరిస్తున్నారో నాలుగు వారాల్లోగా చెప్పాలని కోరింది. ఫోరమ్ అగైనెస్ట్ కరప్షన్‌కు చెందిన విజరు గోపాల్ దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. గుర్తించదగిన నేరం కనిపించినప్పుడు పోలీసులు మొదట జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లో కోరారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ల సంఖ్యపై నివేదికను కోరితే ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర భద్రతా కమిషన్, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదుల అథారిటీ, భరోసా కేంద్రాలు మొదలైన వాటిపై రాష్ట్రం నివేదించిన సమాచారం అసమగ్రంగా ఉందని ఆక్షేపించింది. పూర్తి వివరాలు లేకపోవడంపై బెంచ్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్ర హౌం శాఖ 2013లో జారీ చేసిన మెమోను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్. రాజేశ్వరరావు హైకోర్టు దృష్టికి తెచ్చారు. సత్వర న్యాయం అందాలంటే పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ మోడల్‌ను అనుసరించడాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు. రాష్ట్రంలో ఆ విధానం సరిగ్గా అమలు చేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేసింది.విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సీబీఐ దర్యాప్తు అవసరం లేదు
మియాపూర్‌లోని వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు ట్రినిటీ ఇన్ఫ్రా, గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్ట్రా ఇతర ప్రయివేట్ కంపెనీ, ఇతర ప్రయివేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేయడంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని రాష్ట్రం హైకోర్టుకు స్పష్టం చేసింది. 24 మందిపై చార్జిషీట్లు వేశామని, కేసు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులివ్వాలని పటాన్‌చెరువుకు చెందిన రఘునందన్‌రావు వేసిన పిల్‌ను చీఫ్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది.
కారణాలు చెప్పండి.....
సాంకేతిక విద్యామండలికి హైకోర్టు ఆదేశం
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లమో కోర్సులను ఐదింటిని రద్దు చేయడం, మరికొన్నింటిని మార్పు చేయడానికి కారణాలు చెప్పాలని సాంకేతిక విద్యా మండలిని హైకోర్టు ఆదేశించింది. చాలాసార్లు వివరాలు నివేదించకుండా ప్రభుత్వం వాయిదాలు కోరడంపై పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ అసహనాన్ని వ్యక్తం చేసింది. కోర్సుల రద్దును సవాల్ చేస్తూ ప్రొఫెసర్ శాంతా సిన్హా వేసిన పిల్‌పై విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా పడింది. ఇదే చివరి అవకాశమని చెప్పింది.