Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో దాడులు
- రూ. 1.20 కోట్లు స్వాధీనం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రం నుంచి చైనాకు అక్రమంగా స్మగ్లింగ్ అవుతున్న కోట్లాది రూపాయల తల వెంట్రుకల విగ్గుల అక్రమ వ్యాపారం గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది. రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో అక్రమంగా సాగిస్తున్న ఈ విగ్గుల వ్యాపారుల కార్యాలయాలపై ఈడీ అధికారులు ఈనెల 9 నుంచి 12 తేదీ వరకు సోదాలు నిర్వహించి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగుతున్నట్టు కనిపెట్టారు. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి గువహతి, ఐజ్వాల్ మీదుగా మయన్మార్‌కు వందల కోట్ల విలువైన విగ్గులను కొందరు వ్యాపారులు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు ఈడీకి సమాచారం అందింది. ఈ విధంగా వేల కోట్ల రూపాయల్లో మనీలాండరింగ్ జరుగుతున్నట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో హైదరాబాద్‌లోని ఇబ్రహీంఖాన్కు చెందిన నోయెల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీతో పాటు మరో ఆరు కంపెనీలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు జరిపారు. ఈ దాడుల్లో హైదాబాద్ నుంచి మొదలుకొని ఐజ్వాల్ వరకు షెల్ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా కోట్లాది రూపాయల విగ్గుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు ఈడీ అధికారులు తేల్చారు. హైదరాబాద్ నుంచి మయన్మార్‌కు అక్కడ నుంచి చైనాకు చట్ట వ్యతిరేకంగా విగ్గులు తరలివెళ్తున్నట్టు కనిపెట్టారు. చైనా, మయన్మార్ల నుంచి షెల్ కంపెనీలకు వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు అవుతున్నట్టు తద్వారా మనీ లాండరింగ్ జరుగుతున్నట్టు ఈడీ అధికారులు తేల్చారు. ఈ మేరకు నోయెల్ కంపెనీతో పాటు మరో ఆరు కంపెనీల ఖాతాల నుంచి రూ. 1.20 కోట్లు సీజ్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అలాగే, ఈ కంపెనీలు సృష్టించిన పలు షెల్ కంపెనీలకు చెందిన కోట్లాది రూపాయలున్న బ్యాంకు అకౌంట్లను జప్తు చేయడానికి చట్టపరమైన చర్యలను చేపడుతున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఈడీ అధికారులిచ్చిన ఫిర్యాదు మేరకు నగర నేర పరిశోధక విభాగంలో సైతం ఈ విగ్గుల స్మగ్లింగ్‌కు సంబంధించి కేసు నమోదు చేశారు.