Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఏడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులు, డిజైనర్లను ప్రోత్సహించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డు ఇవ్వనుంది. అర్హులైన చేనేత కళాకారులు, డిజైనర్లు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ చేనేత, జౌళి శాఖ అదనపు డైరెక్టర్ పి. వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డులు చేనేత కళాకారులు, డిజైనర్లకు వారి వృత్తిలో నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. అవార్డు గ్రహీతలకు రూ. 25వేల నగదు, చేనేత శాలువా, మొమెంటో, మెరిట్సర్టిఫికెట్తో సత్కరించనున్నట్టు చెప్పారు. చేనేత కళాకారులు డిసెంబరు 31, 2021 నాటికి 30 ఏండ్ల వయస్సు నిండి, ఆ రంగంలో పదేండ్లకు తగ్గకుండా అనుభవం కలిగి వుండాలి. చేనేత డిజైనర్లు డిసెంబరు 31, 2021 నాటికి 25 ఏండ్ల వయస్సు నిండాలి. చేనేత డిజైన్ల రంగంలో ఐదేండ్లకు తగ్గకుండా అనుభవం కలిగి ఉండాలి. పై అర్హతలు కలిగిన ఔత్సాహికులు నిర్ణీత దరఖాస్తు నింపి, వారి నైపుణ్యతను చాటే నమూనాలను, జౌళి శాఖకు చెందిన జిల్లా సహాయ సంచాలకులకు, ఏప్రిల్ 11వ తేదీలోగా సమర్పించాలి అని సూచించారు. దరఖాస్తు ఫారాలను సంబంధిత జిల్లా చేనేత, జౌళి శాఖ నుంచి పొందొచ్చని తెలిపారు.