Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెలే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలోని అరిబండి భవన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర పాలక పార్టీలు ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని అధికారంలోకొచ్చిన తర్వాత హామీలను విస్మరించాయన్నారు. పోటీపడి మరీ అభివృద్ధి చేయాల్సింది పోయి, దాన్ని పక్కనబెట్టిట్టి ప్రజలపై పన్నులు వేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్నాయన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను పెంచుతున్నాయని, దీంతో పేదలపై భారం పడుతోందని అన్నారు. దేశం గతంలో రూ.55 లక్షల కోట్ల అప్పు ఉంటే.. బీజేపీ పాలనలో ఏడున్నరేండ్లలో ఆ అప్పు రూ.1.45 కోట్లు అయిందన్నారు. 116 పేద దేశాల జాబితాలో భారత్ 103 స్థానంలో ఉందన్నారు. విద్యా, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజలపై మతవిద్వేషాలను రెచ్చగొట్టి పక్క దేశాల పేర్లు చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాసిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారన్నారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది అభివృద్ధి కోసమేనని చెప్పే కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల ఊసే ఎత్తడం లేదన్నారు. మూడేండ్లుగా కొత్త పింఛన్లు లేవన్నారు. మోడీ పెద్దరాజని, కేసీఆర్ చిన్న రాజు అనే భ్రమలో పరిపాలిస్తున్నారని విమర్శించారు. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు నిర్ణయాలను ప్రతిపక్షాలతో చర్చించి తీసుకుంటాయని చెప్పారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి రానున్న కాలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యాన గ్రామగ్రామాన, పల్లెపల్లెనా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పారేపల్లి శేఖర్‌రావు, కొదమగుండ్ల నగేష్, వినోద్, కుంకు తిరుపతయ్య, వెంకన్న పాల్గొన్నారు.