Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్త రాజ్యాంగం రాయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలను పలువురు వక్తలు ఖండించారు. అలా మాట్లాడటమంటే అంబేద్కర్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయాలనీ, పాలకులకు కొత్త రాజ్యాంగం కావాలని మాట్లాడే నైతిక అర్హత లేదని సమావేశం తీర్మానించింది. ప్రజాస్వామ్యాన్ని, భావప్రకటనా స్వేచ్చను, పత్రిక స్వేచ్చను గౌరవించని కేసీఆర్ కొత్త రాజ్యాంగం కావాలని కోరుకోవడమంటే ప్యూడల్ భావజాలంతో కూడిన రాజ్యాంగం రావాలనుకుంటున్నారని అభిప్రాయపడింది. .భారత రాజ్యంగాన్ని మార్చాలి - కొత్త రాజ్యంగం కావాలి అనే చర్చపెడుతున్న శక్తులకు వ్యతిరేకంగా లౌకికవాదులు, ప్రజాస్వామిక వాదులు, దళితులు పోరాడాలని పిలుపునిచ్చింది. తెలంగాణపై నరేంద్ర మోడీ విషం చిమ్మడాన్ని రౌండ్ టేబుల్ సమావేశం ఖండించింది. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్దంగా ఉభయ సభల్లో జరిగిన రాష్ట్ర విభజన ప్రక్రియను మోడీ తప్పుపట్టడమంటే రాజ్యాంగాన్ని, చట్టాలను అవమానించడమేనని అభిప్రాయపడింది. .విభజన చట్టం ప్రకారం తెలంగాణకు బయ్యారం ఉక్కు ప్యాక్టరీ ,రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, గిరిజన యూనివర్సీటీను తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేసింది. టీయూడబ్ల్యూజే నేత విరాహత్ మాట్లాడుతూ ఎవరి దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలేదనీ, రాష్ట్రం ప్రజల బలిదానాల ఫలితమని తెలిపారు. ప్రధాని హౌదాలో ఉన్న మోడీ గతంలోనూ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగంపై దళితులు మాట్లాడే హక్కు లేదంటున్న కేసీఆర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో కేసులు పెడతామనీ, కేసీఆర్ దళితులను అవమానించినందుకు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చే సత్తా కేసీఆర్ కు లేదన్నారు. శాశ్వతంగా సీఎంగా ఉండాలనుకునే చైనా రాజ్యాంగం గురించి సీఎం మాట్లాడుతున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్, యోగానంద్ గౌడ్, జయసారథి రెడ్డి, పీవో డబ్ల్యూ నేత సంధ్య, కాంగ్రెస్ నేత మానవతా రారు, అధ్యయన వేదిక అధ్యక్షులు బి.వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సాధిక్, కోశాధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.