Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ
హైదరాబాద్ : ప్రకృతిని, పర్యావరణాన్ని కేంద్రంగా చేసుకొని గులాబీల మల్లారెడ్డి రాసిన కవిత్వం జనాల్లో పర్యావరణ చైతన్యం పెంపొందడానికి తోడ్పడుతుందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తంగెడ కిషన్ రావు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పనిచేయాలన్న బాధ్యతను గుర్తు చేస్తుందని చెప్పారు. సోమవారం తన ఛాంబర్లో గులాబీల మల్లారెడ్డి కవితా సంపుటి - ప్రకృతి-ప్రియురాలు-మానవత - ను ఆవిష్కరించి ప్రసంగించారు. వాలంటైన్స్ డే నాడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ప్రత్యేక ప్రాధాన్యముందని అన్నారు. అటు ప్రకృతిని, ఇటు మానవతని ఆరాధించే స్వభావం మనుషుల్లో పెరగాలన్న తపనతో మల్లారెడ్డి కవిత్వాన్ని రచించడం ఆహ్వానించదగ్గ విషయమని తెలియజేశారు. ప్రియురాలు గురించి రాసిన కవిత్వం మహిళలపై ఆరాధనా భావాన్ని పెంచుతుందనీ, వారిపై గౌరవభావాన్ని ప్రోది చేస్తుందని చెప్పారు.
పల్లెల్లోని చెరువులు కాపాడుకోవాలనీ, సంప్రదాయిక వ్యవసాయాన్ని బతికించుకోవాలన్న తపన మల్లారెడ్డి కవిత్వంలో కనిపిస్తుందని ఆచార్య కిషన్‌రావు అన్నారు. చెట్లను నరికివేస్తే మరల చెట్లు పెరగడం అంత సులువు కాదు, అడవులు కాపాడుకోవాలని ప్రబోధిస్తూ చక్కని కవిత్వం రాసిన మల్లారెడ్డిని అభినందించారు. పర్యావరణ చైతన్యాన్ని వ్యాప్తి చేసే ఈ కవిత్వం పాఠశాల, కళాశాల విద్యార్థుల చేత చదివించడం ఉపయోగకరమని అన్నారు. అలాగే ఈ సందర్భంగా విమర్శకులు గుడిపాటి మాట్లాడుతూ మల్లారెడ్డి మానవత గురించి రాసిన కవితలు మానవీయ భావనలు పాదుకోడానికి దోహదం చేస్తాయని అన్నారు. వ్యవసాయం గురించి, పల్లెల గురించి తెలంగాణ మాండలికంలో మల్లారెడ్డి గారు చక్కని కవిత్వం రాశారని ప్రముఖ సాహిత్య విమర్శకులు డాక్టర్ రూప్‌కుమార్ డబ్బీకార్ అన్నారు. ఈ సభలో ప్రముఖ కవులు ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, గోపగాని రవీందర్, లేదాళ్ళ రాజేశ్వరరావు పాల్గొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందించిన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కిషన్‌రావు గారికి పుస్తక రచయిత గులాబీల మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.