Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన వైనం
నవతెలంగాణ-అల్లాదుర్గం
చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ ఘటన సోమవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగింది. ఎస్ఐ మోహన్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన బోయిని కిష్టయ్య నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. అయితే అతని అన్న కొడుకు, కోడలైన రమేష్, రజిత చేతబడి చేయడంతోనే కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యాడని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు రమేష్, రజితతో గొడవపడ్డారు. వారిని పట్టుకొని ఇంటి సమీపంలో ఉన్న ఓ విద్యుత్ స్తంబానికి విద్యుత్ తీగలతో కట్టివేశారు. వీరి దాడిని అడ్డుకోబోయిన రమేష్ వదిన (అన్న భార్య సుజాత)నూ చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ మోహన్ రెడ్డి, ఏఎస్ఐ గాలయ్య సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను విడిపించి విచారణ జరిపారు. ఈ దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.