Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదుకునేందుకు ఎక్స్‌ఫర్ట్ కమిటీ వేయాలి
- రౌండ్‌టేబుల్‌లో పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో జోలె పట్టిన సీఎం కేసీఆర్‌కు నేడు కుటుంబాలు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు పట్టట్లేదు? అని ఆయా పార్టీల, ప్రజా సంఘాల నేతలు ప్రశ్నించారు. నేత కార్మికులను ఆదుకునేందుకు ఎక్స్‌ఫర్ట్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్న బైరి శంకరయ్య కుటుంబానికి సంఘీభావంగా సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో జాతీయ నేతన్నల ఐక్యకార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అందులో బీఎస్పీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుజాత, సీపీఐ రాష్ట్ర నాయకులు పి.లక్ష్మీనర్సయ్య, బీజేపీ మాజీ ఎమ్మెల్యే వి.శ్రీరాములు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇందిరా శోభన్, ,తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షులు శారద గౌడ్ ,తెలంగాణ ఉద్యమకారులు సొగర బేగం , సాజిదా సికిందర్, బోనం ఊర్మిళ, ప్రజాసంఘాల నాయకులు కావూరి సత్యనారాయణ గౌడ్, పన్నగంటి అప్పారావు,, కొణతం వీరస్వామి, సత్యనారాయణ, కృష్ణలత, వనం శాంతికుమార్, స్నేహా రెడ్డి, ఓగిరాల సుజి(జనం పార్టీ మహిళా కన్వీనర్), నరేష్ చందర్,కళ్లెపల్లి రాజు నేత, హరీష్ గౌడ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ రోజు ఒకే ఇంట్లో ఒక్కరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే నేడు నేతన్న కుటుంబమంతా సామూహికంగా ఆత్మహత్య చేసుకునే దయనీయ స్థితికి పరిస్థితులు దిగజారాయని వాపోయారు. కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వీవర్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబ సభ్యుల కోసం హెల్ఫ్‌లైన్ నెంబర్(9177756320)ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నేతన్న కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలకు సోయి లేదా ప్రశ్నించారు. నిరుపేద నేతన్నలకు ఐదు లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. నేత కార్మికుల బాగుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని కోరారు. లేకుంటే నేతన్నలందరూ''ఓటు డౌన్'' చేస్తారని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు. నేతన్నల కోసం ప్రత్యేక పాలసీని ప్రకటించి జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలన్నారు.