Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాలెండర్ ఆవిష్కరణలో సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఏకే పద్మనాభన్
నవ తెలంగాణ బ్యూరో- హైదరాబాద్
మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఏకే పద్మనాభన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఖమర్అలీ అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో పద్మనాభన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని రెండు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు (హైదరాబాద్, వరంగల్), 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీల్లోని 64 వేల మంది కార్మికులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే తదితర పద్ధతుల్లో పారిశుధ్యం, పార్కులు, ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్, ఆఫీసుల్లో తదితర విభాగాల్లో కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. వారందర్నీ పర్మినెంట్ చేసి కనీస వేతనాలివ్వాలని కోరారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడుతున్న కరోనా యుద్ధవీరుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనీ, వారికి నామమాత్రంగా వేతనాలిచ్చి వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని విమర్శించారు. జీఓ నెంబర్ 60ని తక్షణమే అన్ని మున్సిపాల్టీల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని కోరారు. కొత్త మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికులకు జీహెచ్ఎంసీలో ఇస్తున్న మాదిరిగా వేతనాలివ్వాలనీ, అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సభలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, కార్యదర్శి ఎస్వీ రమ, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ జనగాం రాజమల్లు, నాగమణి, దాసరి పాండు, నెమ్మాది వెంకటేశ్వర్లు, పి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.