Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ అఖిల ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బొగ్గు గనుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి పరిరక్షణ కోసం కార్మికులంతా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ ఆలిండియా ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల యూనియన్ రాష్ట్ర ఆఫీస్‌బేరర్ల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్చి 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను వేగంగా ప్రయివేటీకరిస్తున్నదనీ, అందులో భాగంగానే సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి పూనుకున్నదని విమర్శించారు. ఇప్పటికే కోయగూడెం బొగ్గు బ్లాకు టెండర్‌కు ఒకరు ముందుకువచ్చారనీ, మిగిలిన బ్లాకులకూ ఏ రోజుకైనా వేలం వేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం మాదిరిగానే సింగరేణిలోనూ కేంద్రం బొగ్గు బ్లాకుల వేలాన్ని విరమించుకునేదాకా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. పోరాటాల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా కలిసి వచ్చేలా కృషి చేయాలని అన్నారు. కేంద్ర బడ్జెట్ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఎస్‌సీఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు బి.మధు, ఎ. ముత్యంరావు, నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎం.శ్రీనివాస్, ఎం.సారయ్య, డి.కొమురయ్య, విజరు కుమార్, శ్రీనివాస్, ఓదెలు, రాజయ్య, విజగిరి శ్రీనివాస్, రమేష్, ముంజం శ్రీనివాస్, కె. బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.