Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ నేతలు ముందుండి
- కులాంతర వివాహాలు జరిపించాలి
- ఆదర్శ వివాహాలపై ప్రభుత్వం ప్రచారం చేపట్టాలి : టీపీఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి.రాములు
నవతెలంగాణ-ముషీరాబాద్
కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహించడం సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడూ గుర్తించాలని, ప్రోత్సహించాలని, కులాంతర వివాహితుల సంపూర్ణ రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కన్వీనర్ జి.రాములు అన్నారు. సోమవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్లో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం (కేవీఎస్ఎస్), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో ఆదర్శ వివాహితుల అభినందన సభ నిర్వహించారు. కేవీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం.దశరథ్ అధ్యక్షత వహించారు. ఆదర్శ దంపతులకు పుష్పగుచ్ఛం ఇచ్చి కండువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం రాములు మాట్లాడుతూ.. కులాంతర వివాహాలు చట్టబద్ధమేనని చెప్పారు. రాజకీయ నేతలు వారి పిల్లలకు కుల, మతాంతర వివాహాలు జరిపించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. వయస్సు నిండిన వారికి ప్రాణాపాయం లేకుండా పోలీసులే పూర్తి రక్షణగా నిలబడాలన్నారు. పోలీసు స్టేషన్లలో ఆదర్శ వివాహాలు జరిపించి సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహించే విధంగా సాంస్కృతిక సారథి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామగ్రామాన చేపట్టాలన్నారు.కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కులాంతర వివాహాలను కేవీపీఎస్ సంపూర్ణంగా బలపర్చడమేగాక వారికి అండగా నిలుస్తుందన్నారు. కులదురహంకార హత్యలు పెరుగుతున్నాయని, వాటిని నివారించడానికి ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని కోరారు. ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖలో మాత్రమే జీవో నెంబర్ 12 ద్వారా రూ.2.50 లక్షలు ఇస్తోందని, తాము పుట్టిన కులంలో తప్ప మరే కులానికి చెందిన వారిని పెండ్లి చేసుకున్నా ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. వివాహ వయస్సు పెంపు అనాలోచిత చర్య అన్నారు భజరంగ్ దళ్ పేరుతో ప్రేమికులపై దాడులు చేయడం వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. కులాంతర వివాహాలు ప్రకృతి పరిణామమని, వాటిని ఆపడం మతోన్మాదుల తరం కాదని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి ఆదర్శ దంపతులకు ఇంటి స్థలం, ఇండ్లతోతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.తెలంగాణ ప్రజాసంస్కృతిక కేంద్రం రాష్ట్ర కార్యదర్శి కె.హిమబిందు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, కులనిర్మూలన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి వహీద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ ప్రసంగించారు. సూర్యకళ అందరినీ వేదికపైకి ఆహ్వానించి స్వాగతం పలికారు.