Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుండిషేకుగూడలో మూడు బోర్లు .. సీసీరోడ్లు
- పిప్రి నుంచి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం
- అధికారుల హామీ
- ఐక్యంగా నిలబడి సాధించిన ఆదివాసులు
నవతెలంగాణ-ఆదిలాబాద్
ప్రాంతీయ ప్రతినిధి, నార్నూర్
పోరాడితే పోయేదేముంది బానిస సంకేళ్లు తప్ప.. అనే నానుడుని ఈ పల్లెవాసులు నిజం చేశారు. ప్రత్యక్ష పోరాటమే సమస్య పరిష్కారానికి ఊతమని భావించి గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలబడి పాదయాత్ర ప్రారంభించారు. అడవుల గుండా..రాళ్లరప్పల మధ్య కాలినడకన రెండ్రోజుల పాటు నడిచి కలెక్టరేట్‌కు వచ్చారు. వారం రోజులపాటు అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించారు కుండిషేకుగూడ వాసులు. సీపీఐ(ఎం) అండగా.. ఈ నెల 7వ తేదీ నుంచి సోమవారం వరకు నిరవధిక దీక్షలు చేపట్టి అధికార యంత్రాంగాన్ని కదిలించారు. దాంతో వారి సమస్య పరిష్కారానికి ఐటీడీఏ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. దాంతో ఆదివాసులు దీక్షలు విరమించారు.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిషేకుగూడ చిన్న మారుమూల పల్లె. మండల కేంద్రం నుంచి గ్రామానికి వెళ్లేందుకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. అడవులు, రాళ్లరప్పల మధ్య తిప్పలు పడుతూ వెళ్లాల్సి ఉంటుంది. మరోపక్క దూప తీర్చుకునేందుకు కనీసం తాగునీరు కూడా లేని దుస్థితిలో జీవనం సాగించారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులను మెరుగుపర్చుకోవాలని భావించారు. ఊరంతా ఒక్కటై పోరుబాట పట్టారు. సీపీఐ(ఎం) అండతో పెద్దాచిన్నా పిల్లాపాపలతో పాదయాత్రగా జిల్లా కేంద్రానికి వచ్చారు. కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకొని నిరవధిక దీక్షలకు దిగారు.
ఈ క్రమంలో వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టి అధికారులకు సమస్యను తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్షలో కూర్చొని రాత్రి వేళలో సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆశ్రయం పొందారు. అనేక మంది దాతలు ముందుకొచ్చి వంట సరుకులు, భోజనం, ఇతరాత్రా వస్తువులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
75ఏండ్ల కల.. ఫలించిన వేళ..!
ఊరు పుట్టినప్పటికీ నుంచి పడుతున్న కష్టాలు నేటికి తీరనున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు గడుస్తున్నా.. ఈ పల్లెవాసులకు ఆ ఫలాలు అందలేదు. కనీసం తాగునీటికి కూడా నోచుకోలేదు. ఊరి చివరన కోసేడు దూరంలో ఉన్న ఊట బావి నుంచి నీటిని తెచ్చుకుంటూ దాహం తీర్చుకున్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక అడవుల గుండా నడుచుకుంటూ ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు. ఈ కష్టాలను దూరం చేసుకునేందుకు వారం రోజులపాటు అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించారు. అధికార యంత్రాంగం కదిలివచ్చింది. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఆదేశాలతో అధికారులు గ్రామంలో మూడు బోర్లు వేయించారు. వీటికి మోటార్లు బిగించి తాగునీటి సరఫరా చేపట్టారు. ఇన్నాండ్లు అలంకారప్రాయంగా ఉన్న మిషన్ భగీరథ పైపుల ద్వారా ఇంటింటికీ నల్లా నీరు సరఫరా చేశారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల కోసం రూ.4.30లక్షలు మంజూరు చేశారు. పిప్రి నుంచి కుండిషేకుగూడ వరకు 7కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపించినట్టు కలెక్టర్ చెప్పినట్టు గ్రామస్తులు, సీపీఐ(ఎం) పార్టీ నాయకులు తెలిపారు. వీటితో పాటు అంగన్వాడీ భవనం, ఇతర మౌలిక వసతులను దశల వారీగా సమకూరుస్తామని భరోసా ఇచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా సమస్యను పరిష్కరించిన అధికారులకు పల్లెవాసులు కృతజ్ఞతలు చెప్పారు.
దీక్షలు విరమణ..
కలెక్టరేట్ ఎదుట వారంరోజుల పాటు నిరవధిక దీక్షలు చేపట్టిన కుండిషేకుగూడ వాసులు అధికారుల హామీతో సోమవారం విరమించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు లంక రాఘవులు, పార్టీ సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి, నాయకులు పూసం సచిన్, అన్నమోల్ల కిరణ్, మయూరిఖాన్, సురేందర్, మసిఉల్లాఖాన్, ఆత్రం నగేష్, కపిల్ ఆదివాసులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. అనంతరం ఆదివాసులు గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పోరాటంలో అండగా నిలిచిన పార్టీ నాయకులు, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.