Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం మార్కెట్లో వ్యాపారుల కుమ్మక్కు..!
- సరుకు నాణ్యత సరిగా లేదని రేటు తగ్గింపు
- జెండా పాట రూ.19వేలలో రెండు, మూడువేలు కోత
- అరకొర దిగుబడి.. ఆపై దోపిడీతో రైతుల ఆందోళన
- వ్యాపారులకే మార్కెట్ అధికారుల వత్తాసు
- ఈ సీజన్లోనే అత్యధికంగా 53వేల బస్తాలు రాక
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ గాంధీచౌక్
ఈ ఏడాది మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తామర నల్లి తాకిడికి అధిక మొత్తం పంట తుడిచిపెట్టుకుపోయింది. అరకొరగా పండిన సరుకు 'అమ్మబోతే అడవి..' చందంగా ఉంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం ఈ సీజన్లోనే అత్యధికంగా 52,896 బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఎప్పటిలాగే మార్కెట్ అధికారులు రేటు నిర్ధారణకు పాట నిర్వహించారు. వరంగల్, గుంటూరులో క్వింటాల్ మిర్చి రూ.18,000 పలుకగా ఖమ్మంలో రూ.19,000 జెండాపాట పెట్టారు. ఈ మేరకు కొనుగోళ్లు ప్రారంభించిన వ్యాపారులు అధిక మొత్తం సరుకు రావడం, ఇతర మార్కెట్లలోకన్నా రూ.వెయ్యి ఎక్కువగా ధర ఉండటాన్ని గమనించి సిండికేట్ అయ్యారు. సరుకు నాణ్యతపై కొర్రీలు పెడుతూ క్వింటాకు రూ.2 నుంచి మూడువేల వరకు ధర తగ్గించారు. దీనిపై రైతులు నిలదీస్తే 'ఇష్టమైతే అమ్మండి లేకుంటే లేదు..' అనే రీతిలో వ్యవహరించారు. గత్యంతరం లేక తమ గోడును రైతులు మార్కెట్ అధికారులకు చెప్పుకున్నారు. వారూ తమ గోడు వినిపించుకోకపోవడంతో మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. మార్కెట్ అధికారులు సైతం వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని రైతులు వాపోయారు.
నాణ్యత సరిగాలేదని కొర్రీలు
నాణ్యత సరిగాలేదనే పేరుతో వివిధ పంటల కొనుగోళ్ల విషయంలో వ్యాపారులు కొర్రీలు పెట్టడం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొంతకాలంగా పరిపాటిగా మారింది. వ్యాపారులు సిండికేటై ధర తగ్గిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అయినా మార్కెట్ అధికారులు, కమిటీ నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రైతుల శ్రేయస్సును విస్మరించి వ్యాపారులకే కొమ్ముకాస్తున్నట్టు రైతులు, రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయమై ఈనెల 10న తెలంగాణ రైతుసంఘం మార్కెట్‌ను సందర్శించింది. తామర నల్లి, వివిధ రకాల వైరస్‌లతో మిర్చి దిగబడులు భారీగా తగ్గిన నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చూడాలని, జెండా పాట, ధర చెల్లింపునకు మధ్య వ్యత్యాసం సరికాదని మార్కెట్ అధికారులను కోరారు. ఇది జరిగి సరిగ్గా నాలుగు రోజులు కాకముందే జెండా పాట.. మిర్చి ధర చెల్లింపు మధ్య భారీ వ్యత్యాసం చోటుచేసుకుంది. ఇదేమంటే ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర, ఆ తర్వాత ఆదివారం నేపథ్యంలో మార్కెట్‌కు ఐదురోజుల పాటు సెలవులు వస్తాయనే కారణంతో పచ్చిసరుకును రైతులు అమ్మకానికి తీసుకొచ్చారని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. అందుకే వ్యాపారులు ధర తగ్గించి ఉంటారని సెలవిస్తున్నారు. ఒకేరోజు అధికమొత్తంలో సరుకు అమ్మకానికి రావడం కూడా ధర తగ్గడానికి కారణంగా చూపుతున్నారు. అంతర్జాతీయంగా ఎగుమతులు లేవని, పరిసర మార్కెట్లలో ధరలు బాగా తక్కువున్నాయని విశ్లేషిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబూబాబాద్, ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి కూడా సరుకు వస్తోంది.
సాగుపెరిగినా తగ్గిన దిగుబడి
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మిర్చి గణనీయంగా సాగు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలోనే 45 శాతం అత్యధిక విస్తీర్ణంలో మిర్చి వేశారు. గతేడాది 55,990.37 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 1,03,000 ఎకరాల్లో సేద్యం చేశారు. మొత్తం 47,010 ఎకరాల విస్తీర్ణం పెరిగినా దీనిలో 90శాతం పంట తామర నల్లి కారణంగా దెబ్బతిన్నది. ఎకరానికి ఒక్కో రైతు రూ.లక్షకు పైగా నష్టపోయాడు. వేలాది ఎకరాల్లో మిర్చి పంటను తొలగించారు. ఉన్న పంట దిగుబడులు కూడా భారీగా పడిపోయాయి. గతంలో ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 5 నుంచి 10 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ దోపిడీ చేస్తుండటంపై ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
ఇష్టమైతే అమ్ము...లేకుంటే తీసుకపో...
నేను 47 బస్తాల మంచి మిరపకాయలు, 21 బస్తాల తాలు కాయలు మార్కెట్‌కు తీసుకొచ్చా. మంచియి రూ.17,700, తాలు రూ.9,500 చొప్పున కొన్నారు. జెండా పాట మీద వెయ్యి, రెండువేలు తగ్గించారు. రైతులందరం ముట్టడేసినా బుధవారం రూ.19,700 పోయింది. శుక్రవారం రూ.19,500 జెండా పాట పెట్టి ఇయ్యాళ రూ.19వేలే పెట్టారు. దాంట్లో రూ.రెండువేలు కోత కోసి వ్యాపారులు కొంటున్నారు. కొంతమంది సరుకైతే రూ.14వేలకు కూడా కొన్నారు. ఏమి మాట్లాడేటట్టు లేదు. 'బాబు...అమ్మితే అమ్ము, తీసకపోతే తీసకపో...లేకపోతే ఏసీలో పెట్టుకో పో..'అంటున్నారు. రాత్రి 12 ఇంటప్పుడు వచ్చినం. వెనక్కి ఏమి తీసుకుపోతామని వాళ్లు చెప్పిన ధరకు అమ్ముకున్నాం. దీనిలో కలసులకూ ఇవ్వాలి. కమీషన్‌దారులకు బస్తాకు రూ.15 చొప్పున ఇయ్యక తప్పదు.
- రామోజీ, బోటిమీది తండా, కూసుమంచి
ఎకరానికి ఐదారు క్వింటాళ్లే వస్తోంది..
తామర నల్లి పంట మొత్తం నాకేసింది. ఒక్క మిరప తోటనే కాదు.. అన్ని పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి పంట పూర్తిగా పోయింది. అప్పట్లో ఎకరానికి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చేది. ఇప్పుడు ఐదారు క్వింటాళ్లే వస్తోంది. కొంతమందికైతే అస్సలు ఈ దిగుబడి కూడా రాలేదు. ఎకరానికి రూ.లక్షన్నర నష్టపోయాం. మేమే కూలోళ్లం.. మేమే రైతులమన్నట్టు ఒకరికొకరం సాయితెగ ఏరుకున్నా పెట్టుబడి కూడా రాదు.
- అంజీర బళ్లు, బజ్జాతండా, కారేపల్లి
పచ్చి సరుకు తెచ్చారు...
నాలుగైదు రోజులు మార్కెట్‌కు సెలవులున్నాయనీ, ఆ తర్వాత రేటు మందగించుద్దేమోననే భయంతో రైతులు మిర్చి పూర్తిగా డ్రై కాకముందే హడావుడిగా తీసుకొచ్చారు. పచ్చి సరుకు తెచ్చిన కారణంగా వ్యాపారులు ధర తగ్గించారు. అంతర్జాతీయంగా కూడా ఎగుమతులు లేవు. పొరుగు మార్కెట్లతో పోలిస్తే మనదగ్గరే మంచి ధర లభిస్తోంది.
- రుద్రాక్ష మల్లేశం, ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ