Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి వృత్తిదారుల సంఘాలు విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు- 2022ను తక్షణం ఉపసంహరించుకోవాలని పలు వృత్తిదారుల సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో రజకులు, క్షౌరవృత్తిదారులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, ఇతర పేదలకు సబ్సిడీపై విద్యుత్‌ను అందచేస్తున్నారనీ, ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే ఆ సౌకర్యాలను కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రజకులు, క్షౌరవృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయాన్ని వారు ప్రస్తావించారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కేంద్రప్రభుత్వం ఈ తరహా బిల్లును రూపొందించిందని విమర్శించారు. తక్షణం దాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రజకుల లాండ్రీలు, దోబీఘాట్లు, క్షౌరవృత్తిదారు సెలూన్లకు రాష్ట్ర ప్రభుత్వం 75వేల ఉచిత కనెక్షన్లు అందింస్తున్నదని వివరించారు. చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ సమావేశం సోమవారంనాడిక్కడి రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సమన్వయకమిటీ రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కన్వీనర్ ఎమ్వీ రమణ మాట్లాడారు. రిజర్వేషన్లను తొలగింస్తూ, ప్రయివేటుపరం చేసే కుట్రలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు బడ్జెట్లో నిధుల కేటాయింపులోనూ వివక్ష చూపిందని విమర్శించారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
20నుంచి ఆందోళనలు
అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో రజక సంఘాలు, కర్మన్‌ఘాట్‌లో నాయీ బ్రాహ్మణ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతన విద్యుత్ చట్టం ముసాయిదాలో సబ్సిడీ మీటర్లు ఎత్తేయాలని, డిస్కంలను ప్రైవేటీకరించాలని ప్రతిపాదించడమే కాకుండా రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టే కుట్రలు చేసి, అధిక చార్జీలను వసూలు చేసే అంశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు క్షౌరం చేయరాదని ఈ సమావేశంలో తీర్మానం చేసినట్టు బస్వరాజు సారయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘాల కో కన్వీనర్ కోట్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు రాధ, రజక సంఘాల నేతలు ముదిగొండ మురళి, అశోక్ కుమార్, నర్సింహా, హరినాద్ తదితరులు పాల్గొన్నారు.