Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష నేతల ఘన నివాళి.. నేడు అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్(60) అనారోగ్యంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారు. అయన భౌతిక కాయాన్ని స్థానిక బాగ్లింగంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు.ఆయన అంత్యక్రియలను మంగళవారం మియాపూర్లో నిర్వహిస్తామని ఎంసీపీఐ(యు) వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్లో తాండ్ర రామచంద్రయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఆయన జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం. ఆయన వారి తల్లిదండ్రులకు ఏడో సంతానం. చిన్ననాటి నుంచి వామపక్షభావజాలంతో ఉన్న ఆయన పేదల పక్షాన పోరాటాలు నిర్వహించారు. ఆయన మరణవార్త విన్న ఎంసీపీఐ(యు) కార్యకర్తలు నాయకులు తాండ్ర కుమార్ ఆశయాలను కొనసాగిస్తామంటూ ప్రతినబూనారు. కుమార్ భౌతిక కాయంపై కేంద్ర కమిటీ కార్యదర్శి మద్దికాయల అశోక్ ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, టీపీఎస్కే కార్యదర్శి జి. రాములు, టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, సీపీఐ రాష్ట్ర నాయకులు నేదునూరి జ్యోతి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, పీఓడబ్ల్యు జాతీయ కన్వీనర్ వి సంధ్య, ఐఎఫ్టీయు కార్యదర్శి అనురాధ, సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేముల పల్లి వెంకట్రామయ్య, కె రమ, ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, ఎస్ఎల్ పద్మ, ఎస్యుసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి, సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటి సభ్యులు గుర్రం విజయకుమార్,సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ నివాళులు అర్పించారు. ఎంసీపీఐ(యు) కేంద్ర, రాష్ట్ర నాయకత్వం కుమార్ ఆశయాలను కొనసాగిస్తామంటూ ప్రతినబూనారు.
తాండ్ర కుమార్ పోరాట స్ఫూర్తి గొప్పది..అశోక్..
తాండ్ర కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంసీపీఐ(యు) కేంద్ర కమిటి కార్యదర్శి మద్దికాయల అశోక్ మాట్లాడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవటంలో నిరంతర కృషి చేశారని తెలిపారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూములను పేద ప్రజలకు పంచటంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ క్రమంలో పోలీసు నిర్భందాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. 40కేసులకు పైగా ఆయనపై మోపారనీ, పీడీ, రౌడ్షీట్ ఓపెన్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. నిరంతరం బహుజన రాజ్యం కోసం తపించారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని చెప్పారు.