Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 12న ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభ
- 10 నుంచి 14 తేదీల మధ్య సమ్మె నోటీసులు, 13 లోపు జిల్లా సదస్సులు : కార్మిక సంఘాల సన్నాహాక సమావేశం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ, కార్మిక చట్టాల నిర్వీర్యాన్ని నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో జరిగే రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సమరశీలంగా చేపట్టాలని కార్మిక సంఘాల సన్నాహక సమావేశం నిర్ణయించింది. నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలనీ, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలనీ, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ రద్దు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలన్న తదితర 14 డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేయనున్నట్టు ప్రకటించింది. సమ్మె జయప్రదం కోసం మార్చి 12న ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభ నిర్వహించాలనీ, అదే నెల 10 నుంచి 14 తేదీల మధ్య సమ్మె నోటీసులివ్వాలనీ, 13లోపు జిల్లా సదస్సులు పూర్తిచేయాలని సమావేశం తీర్మానించింది. సోమవారం హైదరాబాద్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో సార్వత్రిక సమ్మె సమావేశం నిర్వహించారు. అందులో సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి సూర్యం, రామారావు (హెచ్ఎమ్ఎస్) శ్రీనివాస్ (ఐఎఫ్టీయూ) ఆర్డీ.చంద్రశేఖర్ (ఐఎన్టీయుసీ), జె.వెంకటేశ్, వెంకటేశ్(సీఐటీయూ), బి.వెంకటేశం, ఆర్.మల్లేశ్, లతీఫ్(ఏఐటీయూసీ), ఆంజనేయులు(ఏఐయూటీయూసీ), గోపాలక్రిష్ణ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం), తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 42 చట్టాలను 4 కోడ్లను మార్చి పారిశ్రామికవేత్తలకు మేలు చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. దేశంలో కార్మిక సంఘాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు. నూతన ఆర్థిక విధానాల వల్ల కార్మిక వర్గంతో పాటు అనేక వర్గాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం ముమ్మాటికి కార్పొరేట్లకు, సంపన్నవర్గాలకు, పెట్టుబడిదారులకు మేలు చేసే విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి సమ్మెను విజయవంతం చేసి గట్టి సవాలు విసరాలని కార్మికులకు పిలుపునిచ్చారు.