Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- ఎల్ఐసీ జోనల్ కార్యాలయం ఎదుట నిరసనలో ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర అనుమతి కోసం సమర్పించడం దారుణమనీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఇతర జాయింట్ ఫ్రంట్ భాగస్వాములతో కలిసి సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎల్ఐసీ జోనల్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో 600లకు పైగా ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏఐఐఈఏ హైదరాబాద్ డివిజన్ జనరల్ సెక్రటరీ జి.తిరుపతయ్య అధ్యక్షత వహించారు. ఎల్ఐసీ క్లాస్ వన్ ఉద్యోగుల సంఘం నేత శివ ప్రసాద్, డెలప్మెంట్ ఆఫీసర్ల సంఘం నేత రామ్ కుమార్, ఫెడరేషన్ నాయకులు రఘునాథన్, ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా మాట్లాడారు.
గతేడాది బడ్జెట్లో రూ. లక్షా 75 వేల కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ ద్వారా సేకరించాలనే లక్ష్యం నెరవేరకపోవడంతో ఎల్ఐసీపై బీజేపీ సర్కారు కన్నుపడిందన్నారు. ఊహించినట్టుగానే ఎల్ఐసి యొక్క విలువను అత్యంత తక్కువగా చూపే కుట్ర జరుగుతున్నదన్నారు. అధీకృత మూలధనం, చెల్లించిన మూలధనం సంబంధం లేకుండా వాటాలను ప్రకటించడం జరిగిందన్నారు. దీంతో వంద శాతం వాటాలను, యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కలిగి ఉన్నదనేది స్పష్టమైందన్నారు.
ఇప్పటికి కూడా వాటాల మార్కెట్ విలువ, పాలసీదారులు, ఉద్యోగులకు కేటాయించ బోయే వాటాల సంఖ్య లాంటి అంశాలలో అనేక సందేహాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ సవివరంగా ప్రకటించకుండా ఉపసంహరణకు అనుమతి కోరుతూ సెబీని ఆశ్రయించడం తొందరపాటు నిర్ణయమేనని విమర్శించారు. ఎల్ఐసీ విలువను నిర్ణయించడంలో, వాటాల రూపంలో అమ్మేందుకు తీసుకున్న నిర్ణయంలో, పాలసీదారులు, ఉద్యోగులకు సంబంధించిన వివరాల్లో ఎలాంటి పారదర్శకత ప్రభుత్వం ప్రదర్శించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పైసా పెట్టుబడి పెట్టకుండా పాలసీదారుల డబ్బు ద్వారా ఎదిగి వటవృక్షంగా మారిన సంస్థను అప్పనంగా వాటాల రూపంలో అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారనే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు.