Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరైన సాక్ష్యాధారాలివ్వడంలో జాప్యం
- సులువుగా బయటపడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు
- కోర్టులో మళ్లీ విచారణకు అనుమతించాలి
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాప్రతినిధులపై కేసుల్లో ప్రత్యేక న్యాయస్థానంలో సాక్ష్యాధారాలను సరైన సమయంలో ప్రాసిక్యూషన్ చేయడంలో జాప్యం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు శిక్షల నుంచి సులువుగా బయటపడుతున్నారని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ వారు సాక్షులను, సాక్ష్యాధారాలను కోర్టులో సరైన పద్ధతిలో ప్రవేశపెట్టి నిందితులకు శిక్షపడేలా చూడాలనీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కొట్టేసిన ముఖ్యమైన కేసులపై కోర్టుకు అప్పీలు చేయడానికి ప్రాసిక్యూషన్ వారికి ఆదేశాలివ్వాలని విన్నవించారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మకి మంగళవారం ఆయన లేఖ రాశారు. శాసనసభ, పార్లమెంట్ సభ్యులపై నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి సుప్రీం కోర్టు ప్రత్యేక న్యాయస్థానాలను రాష్ట్రాల్లో ఏర్పాటు చేయించిందని ప్రస్తావించారు. తెలంగాణలో 2018లో ప్రత్యేకన్యాయస్థానం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసుల వివరాలు, ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా తమ సంస్థ అధ్యయనం చేయగా చాలా కేసుల్లో శిక్షలు పడట్లేదని తేలిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 మంది ఎమ్మెల్యేలపై 344 కేసులు, పది మంది ఎంపీలపై 133 కేసులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 30 కేసులు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 507 కేసులకుగానూ 380 మాత్రమే ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారని వివరించారు. 338 కేసుల తీర్పులను పరిశీలించగా కేవలం 14 కేసు(నాలుగుశాతం)ల్లో శిక్ష పడిందనీ, మిగతా 324 వీగిపోయాయని పేర్కొన్నారు. నాలుగు కేసుల్లో జైలు శిక్ష, 10 కేసుల్లో జరిమానా విధించారనీ, జైలు శిక్ష పడినవారూ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారని వివరించారు. చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే 2004 మార్చి 31న పబ్లిక్ మీటింగ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సెక్షన్ 153 - ఏ, 188 ఐపీసీ, సెక్షన్ 125, ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద కేసు నమోదైందని పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన మాటలన్నీ వీడియోగ్రఫీ చేసి ఉన్నప్పటికీ ఈ కేసు ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి కోరగా సుమారు పదేండ్లు నాన్చి 2014లో ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. 2018లో అదనపు మెట్రోపాలిటిన్ జడ్జి ముందుకు కేసు రాగా ప్రత్యేక న్యాయస్థానానికి ఆయన బదిలీ చేశారని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌వారు సరైన సాక్ష్యాధారాలు ఇవ్వలేదని చెబుతూ నవంబర్ 16, 2021న కేసును కొట్టేసిందని తెలిపారు. ఇలా అన్ని కేసులూ ప్రత్యేక న్యాయస్థానంలో వీగిపోతున్నాయని వాపోయారు. పలు కేసులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా మార్పు రాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని ప్రజాప్రతినిధులపై కేసులపై సమగ్రంగా విచారణ జరిగేలా చూడాలని కోరారు.