Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయాచితం శ్రీధర్‌కు తెలంగాణ పబ్లిషర్స్ అసోసియేషన్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఉద్యమ కాలంలో వెలువడిన అద్భుత సాహిత్యం ఏ గ్రంథాలయాలకు చేరలేదనీ, ఆ పుస్తకాలను వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ పబ్లిషర్స్ అసోసియేషన్ కోరింది. ఈమేరకు మంగళవారం తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ అయాచితం శ్రీధర్‌కు తెలగాణ పబ్లిషర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కోయచంద్రమోహన్, ఎం సూరిబాబు వినతిపత్రం సమర్పించారు. సాహితీ ప్రియులు, చరిత్ర అధ్యయన విద్యార్థులకు, ఇతర పరిశోధకులకు ఉద్యమ సాహిత్యం అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ సాహిత్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా గ్రంథాలయాలకు ప్రాధాన్యత పెరగాలని పేర్కొన్నారు. ఏడేండ్లైనా కనీసం ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థలు ఎలాంటి కొనుగోళ్ళు చేయలేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో పుస్తకాల కొనుగోళ్ళు దారుణంగా పడిపోయాయనీ, పుస్తకరంగంలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారనీ, పుస్తకాలు ముద్రించుకున్న కవులు, రచయితలు కొనుగోళ్ళ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గ్రంథాలయాల కోసం ఖర్చు పెట్టాల్సిన సెస్, బడ్జెట్ నుంచి అన్ని జిల్లాల గ్రంథాలయ సంస్థలు పుస్తకాల కొనుగోళ్ళు జరిగేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయాలనీ, విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పుస్తక ప్రచురణ రంగాన్ని బ్రతికించాలనీ, గ్రంథాలయాల్లో ప్రజలకు అవసరమైన సాహిత్యాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చొరవ చూపించాల్సిందిగా కోరారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.