Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిగినోళ్లందరికీ పనిదినాలు కల్పించాం
- ఏడున్నరేండ్ల మోడీ పాలన అభివృద్ధిపై కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధం : మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతంలో రూ. 98 వేల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని 73 వేల కోట్లకు కుదించి 25 వేల కోట్ల మేర కోతపెట్టారని సీఎం చెప్పారు. దాంటో వాస్తవం లేదు. గతేడాదీ ఉపాధి హామీ చట్టానికి రూ.73 వేల కోట్లే కేటాయించాం. కరోనాతో తర్వాతి కాలంలో దానికి కేటాయింపులు పెరిగాయి. పట్టణ, సబ్ అర్బన్డివిజన్ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉపాధి కోల్పోయారు కాబట్టి రైతులకు, కార్మికులకు అదనంగా పనిదినాలు కల్పించాం. ఎవరు అడిగితే వారికి పనిచూపెట్టాం. దాంతో రూ.73 వేల కోట్ల నుంచి రూ.98 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. ఇంకా ఆర్థిక సంవత్సరం అయిపోలేదు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. 11 కోట్ల 19 లక్షల మందికి ఉపాధి కల్పించాం' అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఏడున్నరేండ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీనియర్ పాత్రికేయుల సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. అయితే, కేసీఆర్ తన భాషను విడనాడి ప్రజల భాషలో మాట్లాడాలని షరతు విధించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయంలో ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రస్తుత టార్గెట్‌ని పూర్తిచేయలేదన్నారు. ఈ నెల 25వ తేదీన వచ్చే సీజన్లో సేకరించే ధాన్యం టార్గెట్‌పై అన్ని రాష్ట్రాలతోనూ మీటింగ్ ఉందనీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఆహ్వానం పంపామని చెప్పారు. వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్లను పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ తెలంగాణలో త్వరలో పర్యటిస్తారనీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని తెలిపారు. ఐదేండ్లు రాష్ట్రంలో మహిళామంత్రి లేకపోవడం.. సచివాలయానికి రాకుండా పాలన చేయడం..ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం..ప్రశ్నించేవారిని అరెస్టు చేయడం...ప్రతిపక్షనేతలను నిర్బంధించడం..ఇదేనా గుణాత్మక మార్పు అని ప్రశ్నించారు. కొత్తరేషన్‌కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల త్యాగాలను కేసీఆర్ అవమానించడం బాధాకరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత రాజ్యాంగాన్ని పొగుడుతుంటే కేసీఆర్ మాత్రం మారుస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాజ్యాంగ హక్కు వల్లనే హుజురాబాద్‌లో కేసీఆర్ ఓడిపోయారనీ, అప్పటి నుంచి ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీకి నడ్డా తరువాత ఎవరు అధ్యక్షులవుతారో తెలియదుగానీ, టీఆర్ఎస్ పార్టీకి మాత్రం కేసీఆర్ తర్వాత కేటీఆర్‌నే అధ్యక్షులవుతారని చెప్పారు. కేసీఆర్ డైనింగ్ టేబుల్పె రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఎరువులను రైతులకు ఉచితంగా ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం మూడు కోట్లఇండ్లను కట్టించిందనీ, తెలంగాణలో ఇస్తామన్న డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
హైదరాబాద్, విశాఖలో మ్యూజియంల ఏర్పాటు
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో 10 కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో రిమేజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటిలో ఒకటి హైదరాబాద్‌లో, మరొకటి విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో ఐదు కొత్త మ్యూజియాలకు గ్రాంట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.ఒక కోటి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేశామని తెలిపారు. ఏపీలో రూ.35 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం జరుగుతున్నదనీ, దీన్ని ఆయన జయంతి రోజున ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌కు కేంద్రం మంజూరు చేసిన సైన్స్ సిటీకి 25 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు లేఖ రాశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నగలను భద్ర పరిచేందుకు భవనం కేటాయిస్తే తీసుకురావడానికి తమకు అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
నేడు బీజేపీలో యువతెలంగాణ పార్టీ విలీనం
యువతెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం కానున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు రాణిరుద్రమదేవి, ఉమ్మడి పది జిల్లాల అధ్యక్షులతో పాటు పలువురు నాయకులు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ సమక్షంలో ఈ విలీన ప్రక్రియ జరుగనున్నది. యువజన సంఘాల జేఏసీ ఏర్పాటులో, తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
టీఆర్ఎస్ పార్టీలోనూ గతంలో కీలక భూమిక పోషించారు. భువనగిరి టికెట్ విషయంలో కేసీఆర్‌తో వచ్చిన మనస్పర్ధలతో ఆయన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆతర్వాత కాలక్రమంలో కాంగ్రెస్‌ను వీడి యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. భువనగిరి శాసనసభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పలుమార్లు పోటీచేసి స్వల్పతేడాలతో ఓడిపోయారు. స్వతంత్రంగా వెళ్లేదానికంటే ఏదో ఒక పార్టీ గుర్తు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీవైపు తొలుత మొగ్గుచూపారు.