Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన గురుకులాల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతున్నారనీ, అవి దేశానికే దిక్చూచిగా నిలిచాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో మంగళవారం ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఎంబిబిఎస్,ఐఐటిల్లో చదువుతున్న 151మందికి ల్యాప్ టాప్స్,196 మందికి రూ 50వేల చొప్పున,క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చిన 11మందికి నగదు పురస్కారాలు అందజేశారు కార్యక్రమంలో ఐఎఎస్ అధికారులు రాహూల్ బొజ్జ, విజరు కుమార్,యోగితారాణా, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఒక విజ్ఞానవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ప్రభుత్వం గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పిందన్నారు. సీఎం ఆశించిన మేరకు అవి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ, దేశానికి,ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. జీవితంలో గొప్పగా స్థిరపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి మంత్రి అభినందించారు. సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు ల్యాప్ టాప్లను అందించిన స్ట్రీట్ సాఫ్ట్ వేర్ కంపెనీని మంత్రి అభినందించారు.