Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రకాల అప్పీళ్లనూ బహిర్గతపర్చాలనీ, వాటిని ఐఎఫ్ఎంఐఎస్లో నమోదు చేయాలని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో ఉన్న స్పౌజ్ బదిలీల అప్పీళ్లు, ఇతర అన్ని రకాల అప్పీళ్లను పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు స్పౌజ్ బదిలీల విషయం తెలియదనీ, అంతా సీఎస్ ద్వారానే నిర్వహిస్తున్నారంటూ చెప్పడం బాధ్యతారాహిత్యమే అవుతుందని విమర్శించారు. పాఠశాలల్లో పాఠ్యాంశాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు వారి అప్పీళ్ల గురించి రోజూ విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల ఈసడింపులకు గురవుతూ తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. జూనియర్ల బదిలీలు అవుతుంటే తమ అప్పీళ్లు ఏమయ్యాయోనని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. రెండోసారి విడుదలైన స్పౌజ్ కేటగిరీ బదిలీలు పూర్తి పారదర్శకత లేకుండా, వాటిని పైరవీ బదిలీలుగానే ఉపాధ్యాయులు భావిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ ఇప్పటికైనా స్పౌజ్, సీనియర్-జూనియర్, మెడికల్, ఇతర శాఖల స్పౌజ్, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులు, టైపోగ్రాఫికల్ తప్పిదాలు వంటి అన్ని రకాల అప్పీళ్ల వివరాలనూ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎస్, విద్యాశాఖ కార్యదర్శి, సంచాలకులు ప్రాతినిధ్యాల కోసం ఉపాధ్యాయ సంఘాలకు అవకాశమివ్వకుండా ఉండే వైఖరిని ఖండించారు.