Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం)కు సంబంధించిన స్పౌజ్, ఇతర అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌జీహెచ్‌ఎంఏ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం సమర్పించారు. హెచ్ఎంల స్పౌజ్, ఇతర అప్పీళ్లపై బుధవారం అధికారులతో సంప్రదిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. సుమారు 16 ఏండ్లుగా సర్వీస్ రూల్స్‌ను అమలు పరచడంలో ఉన్న ఇబ్బందుల కారణంగా మండల విద్యాధికారుల (ఎంఈవో) నియామకం నిలిచిపోయి ఉందని పేర్కొన్నారు. దీంతో చాలా జిల్లాల్లో నాలుగు,ఐదు మండలాలకు ఒకే ప్రధానోపాధ్యాయుడు అదనపు మండల విద్యాధికా రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో 12 మండలాల్లో మండల విద్యాధికారిగా ఒకరే విధులు నిర్వహించాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఈవో పోస్టులు పాఠశాల విద్యాశాఖలో భాగమే కాబట్టి బదిలీ లేదా పదోన్నతుల ద్వారా వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేసే వరకు పరిపాలనా సౌలభ్యం కోసం తాత్కాలికంగా ఆ మండలంలోని సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు ఇవ్వాలని కోరారు.