Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ చైర్పర్సన్ మీనాక్షి నటరాజన్
నవతెలంగాణ-డిచ్పల్లి
దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించకుండా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ చైర్పర్సన్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సంస్థాన్ సిర్నాపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంగళవారం పర్యటించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, కమ్యూనిటీ హాల్లో రైతులు, డ్వాక్రా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ పేరుతో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి రైతుల పాలిట శాపంగా మార్చారని తెలిపారు. సీఎం కేసీఆర్ స్వలాభం కోసం ధరణి వెబ్‌సైట్‌ను తీసుకొచ్చి ప్రభుత్వ భూములు రైతులకు చెందకుండా చేస్తున్నారన్నారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. కేంద్రం రోజురోజుకి వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని తెలిపారు. వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మార్చి 14 నుంచి ఏప్రిల్ 18 వరకు 600 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి ఈ యాత్రను ప్రారంభించి మహారాష్ట్రలోని సేవాగావ్లో ముగించనున్నట్టు తెలిపారు.