Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ- నల్లగొండ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కూలీలకు ఇచ్చే వేసవి అలవెన్స్ రద్దు చేయడం ఆన్యాయమని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో వ్యకాస నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల సంయుక్త సమావేశం బొజ్జ చిన వెంకులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. గ్రామీణ పేదలకు కరోనా కష్ట కాలంలో.. పని లేని సమయంలో ఉపాధి కల్పించిన ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందన్నారు. 2021-22 బడ్జెట్లో రూ.95 వేల కోట్ల కేటాయింపులు చేస్తే.. 2022-23 బడ్జెట్లో నిధులు పెంచాల్సిందిపోయి 27 శాతం తగ్గించి రూ.73 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. దీంతో కుటుంబాలకు సగటున ఏడాదికి 28 రోజుల పని కూడా దొరకదని, వంద రోజుల గ్యారెంటీ పని ఎక్కడ లభిస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి రూ.2 లక్షల 40 వేల కోట్లు కేటాయించాలని, ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజు వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పట్టణ ప్రజలకు ఉపాధి హామీ చట్టాన్ని వర్తింపజేయాలని, కూలీల వాటాను 90 శాతానికి పెంచి మెటీరియల్ కాంపోనెంట్ 10 శాతం తగ్గించాలని, ఉపాధి హామీలో యంత్రాలను, కాంట్రాక్టర్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. అడిగిన అందరికీ పని, వారం వారం వేతనాలు, మెడికల్ కిట్టు, పేస్లిప్లు, పనిముట్లు, టెంట్లు మంజూరు చేయాలని అన్నారు. మహిళలకు, వికలాంగులకు చేయగలిగిన పనులు అప్పగించాలని, పని చేసే క్రమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన కూలీలకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. మేట్లకు రూ.5వేల పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరించాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు పెండింగులో ఉన్న బిల్లులను అన్నింటినీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిగులు భూములను పేదలకు పంపిణీ చేయాలని, పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని అన్నారు. దళితబంధు పథకాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలకు కాకుండా ప్రతి గ్రామంలో అర్హులైన దళితులందరికీ ఇవ్వాలన్నారు. దళితబంధు పథకంలో లబ్దిదారులను గుర్తించే బాధ్యత కలెక్టర్లకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, కందుల లింగస్వామి, సహాయ కార్యదర్శులు మన్నె బిక్షం, చింతపలి లూర్దుమారయ్య, చెరుకు పెద్దులు తదితరులు పాల్గొన్నారు.