Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ సతమతం : మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ నేతలు సతమతమవుతున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ ఎంపీ బడుగల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, కె.దామోదర్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవే తప్ప అదనంగా కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని స్పష్టంచేశారు. విద్యుత్ సంస్కరణలపై కేసీఆర్ చేసిన వాదన తప్పంటున్న బండి సంజరు, కిషన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యుత్ పాలసీలో దశల వారీగా అన్ని రంగాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలని స్పష్టంగా ఉందన్నారు. దొడ్డిదారిన విద్యుత్ పాలసీని రాష్ట్రాలపై రుద్దాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు.
ఉద్యమంలో పారిపోయిన కిషన్ రెడ్డికి అమరవీరుల స్థూపం తాకే హక్కుందా?
రాష్ట్ర మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డికి అమరవీరుల స్థూపం తాకే హక్కుందా? అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు భేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడకుంటే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వచ్చేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడేది తెలంగాణ భాష, బీజేపీది మత విద్వేషాల భాష అని చెప్పారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కిషన్ రెడ్డి డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.364 కోట్లు ఖర్చు పెడుతున్నదనీ, కేవలం రూ.2.5 కోట్లిచ్చి కిషన్ రెడ్డి జబ్బలు చరచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.