Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని దారులూ మేడారానికే..
మేడారం జాతర.. ఒకప్పుడు ఆదివాసీలు, జానపద కళాకారులు, గ్రామీణులు పాల్గొనే పరిస్థితి. ఈ జాతరకు రెండు దశాబ్దాల కిందట వరకూ పెద్ద సంఖ్యలో ఎడ్లబండ్లలో వచ్చేవారు. కాలక్రమేణా జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఎడ్లబండ్లపై వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి సంఖ్య అధికమైంది. 2012లో తొలిసారిగా హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చింది. 2014 నుంచి వరంగల్‌లోని మామునూరు, హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయాల నుంచి పర్యాటకులను తీసుకురావడానికి ప్రత్యేకంగా హెలీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇలా మేడారం జాతర ఎడ్లబండ్ల నుంచి మొదలై హెలికాప్టర్ల దాక.. సందర్శకుల తాకిడి పెరిగింది.
నవతెలంగాణ-ములుగు/తాడ్వాయి
1990 వరకూ నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పెద్దగా ఈ జాతరకు వచ్చే పరిస్థితి లేదు. ఇరుకైన రోడ్లు, గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్, అంతంతగానే ఉండే పారిశుధ్య కార్యక్రమాలు, తదితర కారణాలతో.. 1994 జాతర వరకూ భారీ సంఖ్యలో గ్రామీణులు, గిరిజనులు మాత్రమే ఎడ్లబండ్లలో వచ్చేవారు. జాతర ప్రారంభానికి ఒకటి, రెండ్రోజుల ముందే ఎడ్లబండ్లలో మేడారం వచ్చి నివాసం ఏర్పర్చుకుని సారలమ్మ, సమ్మక్కలు గద్దెలపై ప్రతిష్ఠాపన అయ్యాక మూడోరోజు పూర్తిస్థాయి దర్శనం చేసుకున్న అనంతరమే తిరిగి వెళ్లడం ఆనవాయితీ. అలా 1994లో మేడారం జాతరకు 25 వేలకుపైగా ఎడ్లబండ్లు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడ్లబండ్ల ద్వారా జంపన్నవాగు నుంచి మేడారం చేరుకోవాలనే స్థానిక గిరిజనుల విశ్వాసం. కానీ, 1996లో జంపన్నవాగుపై భక్తుల స్నానాలకు అనువుగా స్నానఘట్టాలు నిర్మించడంతో క్రమంగా ఎడ్లబండ్ల సంఖ్య భారీగా తగ్గింది. స్నానఘట్టాలతో వాగు దాటడానికి అనువుగా లేకపోవడం, కాలక్రమంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రస్తుతం వందల సంఖ్యలో మాత్రమే ఎడ్లబండ్లు వస్తున్నాయి. 2002లో స్థానిక గిరిజనుల డిమాండ్ మేరకు జంపన్నవాగుపై ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించింది. అలాగే వాగు పొడవునా దాదాపు ఊరట్టం క్రాస్ రోడ్డు వరకు స్నానఘట్టాలను నిర్మించారు. ఇలా, మేడారం జాతర ప్రస్థానం ఎడ్ల బండి నుంచి హెలికాఫ్టర్ వరకు మారింది.
హెలీకాప్టర్ ప్రయాణానికి కాజీపేట నుంచి రూ.20 వేలు
బెంగుళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హెలీకాప్టర్తోపాటు రాజస్థాన్‌కు చెందిన ప్రైజెలైన్ ఆధ్వర్యంలో విస్సా ఫౌండేషన్ సహకారంతో మేడారం జాతరలో అడ్వెంచర్ హాట్ ఎయిర్ బెలూన్, ప్యారా సెయిలింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు హెలీకాప్టర్ ద్వారా ప్రయాణానికి (రాకపోకలకు కలిపి) ఒక్కొక్కరికి రూ.19,999గా నిర్ణయించారు. అలాగే మేడారం జాతరలో ఏరియల్ వ్యూరైడ్ కోసం ఒక్కొక్కరికి రూ.3700 చెల్లించాల్సి ఉంటుంది.