Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ సహాయకులకు ఇవ్వని పేస్కేల్ జీవో
- దశలవారీగా ఆందోళనలు
- ఈనెల 22న చలో హైదరాబాద్‌కు సన్నద్ధం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పే స్కేల్ విషయంలో ప్రభుత్వం రెవెన్యూ సహాయకులను విస్మరించింది.. 'రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఉద్యోగులతో పాటుగా గ్రామస్థాయిలో పనిచేస్తే రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ జీవోను విడుదల చేస్తాం' అని 2020 సెప్టెంబర్‌లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటన కాగితాలకే పరిమితమై అమలుకు నోచుకోకుండా పోయింది. రెవెన్యూ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే భావన వీఆర్ఏలలో ఉంది. అందుకే సమస్యల పరిష్కారం కోసం నడుం బిగిస్తున్నారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ విభాగంలో సుమారు 1700 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శి పరిధి, మండల స్థాయిలో తహసీల్దార్ పరిధిలో పనిచేస్తుంటారు. వీళ్లలో సుమారు 30ఏండ్లకు పైగా పని చేస్తున్నవారే ఉన్నారు. ఖాళీలున్న చోట గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసింది. వీరంతా ప్రభుత్వానికి.. ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ, భూసమగ్ర సర్వే, హారితహారం, సాదాబైనామా క్రమబద్ధీకరణ, ఎన్నికల విధులు, కరోనా విధులు, దళిత బంధు, తదితర సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ గొడ్డుచాకిరీ చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలలూ ఇవ్వడం లేదు
18నెలలైనా పరిష్కరించరా..?
2020 సెప్టెంబర్ 9న శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ''వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వీఆర్ఏలను కొనసాగిస్తాం.. వారంతా తరతరాలుగా అతితక్కువ వేతనంతో పనిచేస్తున్నారు.. అందరూ కింది సామాజిక తరగతుల నుంచి వచ్చిన వారే..'' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేగాకుండా వారు గౌరవంగా జీవించడానికి పే స్కేల్ ఇస్తాం.. తల్లిదండ్రుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దీంతో ఎంతో ఆశ పెట్టుకున్న వీఆర్ఏలకు నిరాశే ఎదురవుతోంది. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన సీఎం 18నెలలు దాటినా జీవో విడుదల చేయకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
పీఆర్సీలో కూడా అన్యాయమే..
గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ వచ్చేది. అయితే, గతానికి భిన్నంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు, స్కీంవర్కర్లకు.. అన్ని విభాగాల ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. అయితే, ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ ప్రతిపాదించిన వేతనం పెంచకుండా.. వీఆర్ఏలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10,500 వేతనంపైనే 30శాతం పెంచుతూ ఆర్థికశాఖకు ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే పెంచిన పీఆర్సీ జీవోలు అన్ని రంగాలకు విడుదల చేసి వీఆర్ఏలకు మాత్రమే విడుదల చేయలేదు.
గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్స్
- అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి.
- 55ఏండ్ల వయస్సు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలి
- అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి
- గ్రామ సహాయకులకు సొంత గ్రామాల్లో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించాలి
- కరోనాతో మరణించిన వీఆర్ఏలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం
సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో పాటుగా పెండింగ్‌లో ఉన్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని వారు పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా, ఈనెల 10న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దానికి కొనసాగింపుగానే ఈనెల 22న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా కోసం చలో హైదరాబాద్‌కు సన్నద్ధమవుతున్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘాల (వీఆర్ఏ) ఐక్యకార్యాచరణ కమిటీ పేరుతో ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తగిన ప్రణాళికలను కమిటీ నిర్ణయించింది.
పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి
పెండింగ్‌లో ఉన్న వీఆర్ఏల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలి. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన పేస్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.
చిన్నపాక లక్ష్మినారాయణ- వర్కింగ్ ప్రెసిడెంట్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నల్లగొండ