Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూనుగొండ్లలో మార్మోగిన పగిడిద్దరాజు నామస్మరణ
- పెనుక వంశీయుల ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-కొత్తగూడ/గంగారం
మేడారం జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తజనం తండోపతండాలుగా పోటెత్తుతున్నారు. సమ్మక్క-సారలమ్మ సైతం గద్దెలకు చేరే సమయం దగ్గరపడుతోంది. ముందుగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు అతడి స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల నుంచి మంగళవారం ఉదయం 11.30 గంటలకు మేడారానికి బయల్దేరారు. పెనుక వంశీయుల ఆడబిడ్డలు గుమ్మడి శేషక్క, మోకాళ్ల సులోచన పగిడిద్దరాజు ఆలయాన్ని నీటితో శుద్ధి చేయగా తలపతి పెనుక వెంకటేశ్వర్లు ఇంటి నుంచి పసుపు కుంకుమతో పగిడిద్దరాజు పాన్పును సంప్రదాయ పద్ధతిలో డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ ఆలయానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పూనుగొండ్ల గ్రామం పగిడిద్దరాజు నామస్మరణతో మార్మోగింది. అనంతరం పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి ఆలయంలోని గొబ్బెకు పెనక వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించి వెదురు (వనం)కు పడిగను అలంకరించి అతిధులు, ప్రజాప్రతినిధులకు కంకణాలు కట్టారు. పగిడిద్దరాజు పడిగలను అటవీ మార్గంలో దాదాపు 80కి.మీ దూరం కాలినడకన పగిడిద్దరాజు పూజారులు పెనుక బుచ్చిరాములు, పెనుక సురేందర్, పెనుక పురుషోత్తంతోపాటు పెనుక వంశీయులు, గ్రామస్తులు మేడారానికి చేర్చనున్నారు. పగిడిద్దరాజు.. గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో మంగళవారం రాత్రి బస చేశారు. నేడు (బుధవారం) తెల్లవారుజామున నాలుగు గంటలకు సంప్రదాయ పద్ధతిలో లక్ష్మీపురం నుంచి బయల్దేరి పస్రా, వెంగళాపూర్, పడిగపురం గ్రామాల మీదుగా వెళ్లి జంపన్నవాగులో స్నానాలు ఆచరించి గోవిందరాజు, సారలమ్మను కలుసుకుంటారు. అక్కడి నుంచి బుధవారం సాయంత్రంలోగా సారలమ్మ, గోవిందరాజులతో కలిసి పగిడిద్దరాజు గద్దెలను చేరుకుంటారు.
పగిడిద్దరాజుకు డీసీపీ పూజలు
గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి బయల్దేరుతుండగా పగిడిద్దరాజుకు ములుగు డీసీపీ సాయిచైతన్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నడుమ ఏర్పాట్లు చేశారు.