Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల హక్కులకు భంగం
- ప్రయివేటీకరణ కోసమే: వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నదుల అనుసంధానం దేశానికి నష్టం చేస్తుందని వాటర్ మ్యాన్, రామన్ మెగాసెస్సే అవార్డు గ్రహిత డాక్టర్ రాజేంద్ర సింగ్ స్పష్టం చేశారు. వీటి అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. దాని మూలంగా రాష్ట్రాల మధ్య తగాదాలు ఉత్పన్నమవుతాయని వివరించారు. వాటి హక్కులకు భంగం కలుగుతుందని వాఖ్యానించారు. ఇదంతా పెద్దల కోసమే చేస్తున్నారని విమర్శించారు. ప్రయివేటీకరణ, మార్కెటీకరణ, వాణిజ్యీకరణ జరుగుతున్నదని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశ్‌రావు, జల ప్రముఖులు ఆర్. సత్యనారాయణ, గురుస్వామి, వెంకటేశ్, రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి. శ్యాంప్రసాద్‌రెడ్డితో కలిసి రాజేంద్రసింగ్ మీడియాతో మాట్లాడారు. మిగులు జలాలు ఉన్నాయని ఏ రాష్ట్రం అంగీకరించలేదని ఆయన గుర్తు చేశారు. అనుసంధానం అవినీతికి ఆజ్యం పోస్తుందని అభిప్రాయపడ్డారు. అనుసంధానించాల్సింది నదులను కాదు.. నదులతో మనషుల మేథస్సు, హదయాన్ని అని సూచించారు. కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపడితే గాంధీజీ మార్గంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని నీటి పారుదల విషయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు. సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అన్ని రాష్ట్రాలు అనుసరించాలన్నారు. వ్యవసాయానికి, ఇతర రంగాలకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. ప్రతిగ్రామంలో పైపుల ద్వారా మంచినీటి సరఫరా చేయడం హర్షణీయమనీ, రాష్ట్రంలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
రివర్ లిటరసీ ఉద్యమాన్ని త్వరలోనే ప్రారంస్తున్నామనీ, ఇందులో ప్రజలూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నీటికి సంబంధించి దేశ ప్రజలకు కావాల్సిన మ్యానిఫెస్టోను జాతీయ సదస్సులో విడుదల చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు సూచనలతో 1992లో 25 వేల మైనింగ్ కంపెనీలు మూసివేశారని గుర్తు చేశారు. తరువాత భూగర్భ జలాలు ఉబికి వచ్చి నీటి సమస్య పరిష్కారమైందని చెప్పారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చాలా బాగుందనీ, సర్వాంగ సుందరంగా దేవాలయాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. మూడు చెరువుల నుంచి దేవాలయానికి నీరు సరఫరా చేస్తున్నారనీ, ప్రకతిని ప్రేమిస్తే మనుషులకు బలమైన శక్తి సిద్ధిస్తుందని వివరించారు. సీఎం కేసీఆర్‌ను చూసి దేశం నేర్చుకోవాల్సిందేనని పేర్కొన్నారు. దేశానికి సీఎం కేసీఆర్ రోల్ మెడల్ అని అభినందించారు. రాష్ట్రంలో వాటర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇది తెలంగాణలో సాధ్యమని చెప్పారు. ఈనెల 26, 27 తేదీల్లో నదులపై హైదారాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. నదుల అక్షరాస్యత అవసరమనీ వివరించారు. ఈ సందర్భంగా నదుల గురించి ప్రత్యేక విధానం విడుదల చేస్తామని తెలిపారు. తాను రాజకీయ వాదిని కాదనీ, నీటి మనిషిని మాత్రమేనని చెప్పారు. ఎక్కువ చెప్పేవాళ్లు పనిచేయరనీ, పనిచేసేవాళ్లు ఎక్కువ చెప్పబోరని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా వాఖ్యానించారు. పంచ భూతాలు కీలకమని వివరించారు. తెలంగాణ నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశరావు మాట్లాడుతూ ఎక్కడి నీళ్లు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజేంద్రసింగ్ ఆకాంక్ష అని చెప్పారు. వర్షపు నీళ్ల నిర్వహణను జాగ్రత్తగా చేయాలని చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును అమలుచేయాలని కోరారు. నీటి అక్షరాస్యత బాగా పెరగాలని వివరించారు. నీటిపై అధ్యయనం కోసం ప్రతినెలా నాలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. నీటిని కేంద్రీకరణ చేయెద్దనీ, వికేంద్రీకరణ ద్వారా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి. శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రసింగ్ 12 నదుల పునరుద్దరణకు పాడుపడ్డారని ప్రశంసించారు. వరి, చెరుకు మినహా రూ. 5 వేల కోట్ల ఖర్చుతో ఇతర పంటలకు నీటిని అందుబాటులోకి తేవచ్చని అభిప్రాయపడ్డారు.