Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ శ్రీరాం నాయక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఫలక్నుమాలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీజీఎస్ అధ్యక్షులు ఎం ధర్మానాయక్, ఛత్రినాక సీఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాంనాయక్ మాట్లాడుతూ తరతరాలుగా అణచివేత, దోపిడీకి గురైన బంజారా గిరిజన సమాజాన్ని ఏకతాటిపైకి నడిపించిన పోరాటయోధుడు సేవాలాల్ అని తెలిపారు. హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. వందలేండ్లుగా సంచార జీవనం గడుపుతున్న బంజారాలను ఐక్యం చేశారని తెలిపారు. తండాలను స్థాపించుకుని స్థిర వ్యవసాయాభివృద్ధికి బాటలు వేయాలని దిశానిర్దేశం చేసిన మార్గదర్శకుడని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై సేవాలాల్ స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సేవాలాల్ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం ,అభివృద్ధి కోసం గత ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క మేలు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పైగా గిరిజనుల సంస్కృతి, జీవన విధానంపై దాడి చేస్తూ వారి హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించక పోవటం దుర్మార్గమన్నారు. శతాబ్దాలుగావారికి జీవనాధారమైన అడవులు, అటవీ సంపదను సైతం కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములపై హక్కులు కల్పిస్తామని గిరిజనుల నుండి లక్షలాది దరఖాస్తులను స్వీకరించి ఇంతవరకు పరిశీలన కూడా చేయకపోవడం వారిని మోసం చేయడమే అవుతుందని అన్నారు. గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో ఆరు శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లను పెంచటం కోసం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సౌత్ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్సులు ఎం.బాలునాయక్ ,ఆర్.రామ్ కుమార్ నాయక్ , ఆంగోతు కష్ణ నాయక్, కిషన్ నాయక్, శ్రీను,చిన్నా, నవీన్,కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.