Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగం, పేదరికం మోడీ విజయాలు
- ధర్మభిక్షం స్ఫూర్తితో నిరంకుశంపై పోరాడాలి
- శతజయంతి సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
- స్వామీజీలు రియల్టర్లయ్యారు : నారాయణ
- ఎర్రజెండా పట్టిన వారిలో స్వార్థం ఉండదని నమ్మిన ధర్మభిక్షం : మంత్రి జగదీశ్‌రెడ్డి
- పోరాట మార్గంతోనే సమత, సమానత్వం: చెరుపల్లి
నవతెలంగాణ- కల్చరల్
బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తిని, లౌకికవాద నీతిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఇలాంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజలు ఐక్యపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. నిబద్ధత, నిజాయితీగల ధర్మభిక్షం నిరాడంబరంగా, కమ్యూనిస్టుగానే జీవించారని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర వహించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా సమస్యలపై గళమెత్తారని, ఆ స్ఫూర్తితో ప్రస్తుతం మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బీజేపీ పాలనపై పోరాటానికి సంసిద్ధమయ్యారని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల మోడీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, ఇకపైనా అలాగే ఉండాలని కోరారు. భిన్న సంస్కృతులు, భాషలు, మతాలు, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ఒకే జాతి, ఒకే సంప్రదాయం, ఒకే మతం, ఒకే భాష సంస్కృతం, ఒకే ఎన్నిక అంటూ మోడీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవాలన్నారు. హిందుత్వ వాదంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అన్నారని, అట్టి ప్రాంతీయ భాషలను దిగజార్చి హిందీ సంస్కృతాన్ని రుద్దాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక, కర్షక, పేదల కోసం కాదని టాటా, అదాని, అంబానీల వంటి కార్పొరేట్ల కోసమేనని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక సంక్షోభం మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులను కేరళ నుంచి కూడా వెళ్లగొడతానంటున్నారని, అలా అన్న ముస్సోలిని, హిట్లర్ చరిత్ర కాలగర్భంలో కలిసి పోయారని, కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని చెప్పారు. ఆల్ ఇండియా మూవ్మెంట్లో సమైక్యంగా జస్టిస్ ఫర్ ఇక్వాలిటీ కోసం పోరాటం చేయాలన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. సమతా విగ్రహం వద్దకు కేంద్ర మంత్రులు క్యూ కట్టారని, స్వామిజీలు రియల్టర్లుగా మరిపోయారని విమర్శించారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రజెండా పట్టిన వారిలో స్వార్థం ఉండకూడదని నమ్మిన కొద్దిమందిలో ధర్మభిక్షం ప్రముఖులని చెప్పారు. ఆయన కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతులని కొనియాడారు. ప్రపంచ పటంలో తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు. హక్కుల కోసం నియంతలపై పోరాడే శక్తి తెలంగాణ సమాజం రక్తంలోనే ఉందన్నారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ధర్మభిక్షం సహచర్యంలో పనిచేసే అవకాశం యువకునిగా ఉన్న సమయంలో తనకు వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించాలని, పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను పొందుపరిస్తే యువతకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. సమత, సమానత్వం యాగాల వల్ల రావని, పోరాట మార్గం ద్వారా వస్తాయని చెప్పారు. ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసుకొని, ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉందన్నారు.
మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లడుతూ.. రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా నియంత్ర పోకడలు పోయేవారికి బుద్ధి చెప్పాల్సింది యువతేనని అన్నారు.
అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. లౌకిక ప్రజాస్వామిక శక్తులు ఏకం కావాలన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, రామకృష్ణ, అజీజ్ పాషా, పి.వెంకట రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు ధర్మ భిక్షం నిబద్ధత, నైతికతలను ప్రశంసించారు.