Authorization
Mon March 31, 2025 11:50:05 pm
- నాణ్యమైన ఆహారం కావాలి
- గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన
నవతెలంగాణ -నల్లగొండ
ముద్దల అన్నం మాకొద్దు.. నాణ్యమైన ఆహారం కావాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు మంగళవారం నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల గేటు ఎదుట ఆందోళన చేశారు. చండూరు ఎస్సీ గురుకుల పాఠశాలను జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ డాన్‌బోస్కో పాఠశాలలో నిర్వహిస్తున్నారు. 720 మంది విద్యార్థులు ఉన్నారు. వండిన అన్నం ముద్దలు కావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మూడు నెలల నుంచి నాణ్యతలేని బియ్యాన్ని వండటంతో భోజనం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అనేకమార్లు పాఠశాల ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. నీళ్ల చారు, పప్పు, ముద్దల అన్నం తినలేక పస్తులుంటున్నామన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, సివిల్ సప్లరు అధికారులు కల్పించుకుని గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఆహారంతోపాటు తాజా కూరలు అందించాలని కోరారు.
హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు
చరిత్ కుమార్- ఇంటర్ సెంకడియర్
ఈ హాస్టల్లో మూడు నెలల నుంచి నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. ముద్లల అన్నం, నీళ్లచారు పెడుతున్నారు. అన్నం తినలేక పుస్తులుంటున్నాం.
ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం ప్రిన్సిపాల్ మొహమ్మద్ ఖుర్షీద్
పాఠశాలకు నాణ్యతలేని బియ్యం సరఫరా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఇవే బియ్యం సరఫరా అవుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.