Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాలయాల్లో మత రాజకీయాలు తగదు: రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హిజాబ్ సాకుతో ముస్లిం మహిళల విద్యా హక్కును హరించొద్దనీ, విద్యాలయాల్లో మత రాజకీయాలను జొప్పించటం దేశ ఐక్యతకు విఘాతమని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ, టీపీఎస్కే, ఆవాజ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, ఆవాజ్ కార్యదర్శి ఎండీ అబ్బాస్, టీపీఎస్కే కన్వీనర్ హిమబిందు, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి, బి. హైమావతి, ఆశాలత, ఇందిర వివిధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కర్నాటకలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హిజాబ్ సమస్యనొక్కదాన్నీ విడిగా చూడరాదన్నారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి, బీజేపీి తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలపై హిందూత్వ ఎజెండాను రుద్దేందుకు పట్టుబట్టి మరీ ప్రయత్నిస్తోందని తెలిపారు. 2020లో అన్ని రకాల పశువులను వధించడానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాన్ని ఆమోదించిందని గుర్తుచేశారు. ఈ చట్టం ప్రధానంగా ముస్లిం మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుందన్నారు. ఆ తర్వాత 'మత స్వేచ్ఛా హక్కు పరిరక్షణకు సంబంధించిన బిల్లు-2021'ను తీసుకువచ్చిందని తెలిపారు. బలవంతపు మత మార్పిడులపై పోరు పేరుతో క్రైస్తవులను, మతాంతర వివాహాలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లు తీసుకువచ్చారన్నారు. దీంతో వివిధ మతాలకు చెందిన, యువతీయువకులను సామాజికంగా కూడా కలవకుండా కాపు కాసి దాడులు జరపడం చూశామన్నారు.