Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాన్ని అన్ని రాష్ట్రాలకూ అంటించాలని చూస్తున్న బీజేపీ!
- హిజాబ్ ధరించి రావొద్దంటూ మధ్యప్రదేశ్‌లో కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశం
- వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, దుర్గావాహిని కార్యకర్తలు వచ్చివెళ్లిన తర్వాత నిర్ణయం
- మతపరమైన ఎజెండాతోనే కర్నాటకలో చిచ్చు : రాజకీయ విశ్లేషకులు
- బీహార్‌లోనూ రాజకీయ దుమారం!
న్యూఢిల్లీ : హిజాబ్ వివాదం మధ్యప్రదేశ్‌ను తాకింది. గ్వాలియర్‌లోని దాటియా ప్రభుత్వ పీజీ కాలేజీలోకి వీహెచ్‌పీ, భజ్రంగ్దళ్, దుర్గా వాహిని కార్యకర్తలు వచ్చి వెళ్లిన కొద్ది గంటల్లోనే..ఆ కాలేజీ ప్రిన్స్‌పాల్ హిజాబ్ ధరించి రావొద్దంటూ విద్యార్థుల్ని ఆదేశించారు. కాలేజీ ఆవరణలో ఇద్దరు ముస్లిం యువతలు హిజాబ్ ధరించి కనపడటంతో..వారికి వ్యతిరేకంగా హిందూత్వ సంస్థల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజ్ ప్రిన్స్‌పాల్ డి.ఆర్.రాహుల్..హిజాబ్ ధరించిన విద్యార్థుల గురించి వాకబ్ చేశారు. వారెవరన్నది తెలుసుకోవాలని, హిజాబ్ ధరించి కాలేజీ ఆవరణలోకి ఎవరూ ప్రవేశించరాదని కొద్ది గంటల్లోనే ఆదేశాలు జారీచేశారు. మతపరమైన వస్త్రధారణతో విద్యార్థులెవరూ కాలేజీలోకి రాకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ఎం.కామ్ మూడో సెమిస్టర్ చదువుతున్న ముస్లిం యువతి హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరుకాగా, కాలేజ్ యాజమాన్యం అడ్డుకుంది. మరోసారి హిజాబ్ ధరించి రానని రాతపూర్వకంగా లేఖ ఇచ్చాకే ఆమెను పరీక్షకు అనుమతించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంగానీ, స్థానిక పోలీస్ ఉన్నతాధికారులుగానీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
అలా అనటం హక్కుల్ని కాలరాయటమే
- దక్షిణాఫ్రికా న్యాయస్థానం ఏం చెప్పిందో చూడండి : హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో మంగళవారం వాదనలు వాడివేడిగా సాగాయి. హిజాబ్ ధరించటం మత సాంప్రదాయమని, దానిని మతస్వేచ్ఛగా చూడాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఇంతక్రితం న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. హిజాబ్ ధరించ రాదంటూ ఆదేశించటం..ప్రాథమిక హక్కులను కాలరాయట మేనని తెలిపారు. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం హిజాబ్ వివాదంపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది దేవ్‌దత్ కామత్ తన వాదనల్ని ముగించారు. హిజాబ్ ధరించటం మత స్వేచ్ఛ, మత సంప్రదాయానికి సూచికగా తీసుకోవాలని కోరారు. 'సోనాలీ పిళ్లై' కేసులో దక్షిణాఫ్రికాలో వెలువడిన తీర్పును ఈ సందర్భంగా దేవ్‌దత్ కామత్ ఉదహరించారు. విద్యార్థుల మత నమ్మకాలు, ఆచారాల్ని దృష్టిలో పెట్టుకొని వివక్షకు తావివ్వరాదని, కాలేజీ యాజమాన్యం సోనాలీపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని దక్షిణాఫ్రికా న్యాయస్థానం తీర్పు చెప్పగా, ఆ విషయాన్ని దేవ్‌దత్ కామత్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్ విచారణ వాయిదాపడింది. మరోవైపు మంగళవారం కర్ణాటక వ్యాప్తంగా ముస్లీం అమ్మాయిలు ఆందోళనకు దిగారు. హిజాబ్ లేకుండా తాము తరగతి గదుల్లో అడుగు పెట్టమని తేల్చి చెప్పారు.
13 మంది విద్యార్థులు పరీక్షలకు దూరం
కర్నాటకలో మంగళవారం హిజాబ్ తొలగించేందుకు నిరాకరిస్తూ 13 మంది విద్యార్థులు పరీక్షలు రాయకుండా వెనుతిరిగారు. ఉడుపి, శివమొగ్గ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలకు కొంతమంది విద్యార్థులు హిజాబ్‌తో వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు హిజాబ్ తొలగించాల్సిందేనంటూ ఉపాధ్యాయులు సూచించారు. ప్రత్యేక గదిని కేటాయిస్తామనీ, అక్కడ హిజాబ్ తొలగించి పరీక్షలు రాయాలని అనడంతో విద్యార్థులు తిరస్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారిని వాపసు తీసుకువెళ్లారు. తమ పిల్లలను పోలీసులతో బెదిరించారని మరికొందరు తల్లిదండ్రులు తెలిపారు. హిజాబ్ ధరిస్తే తరగతులకు హాజరుకానివ్వమనీ, బయట కూర్చుంటారని యాజమాన్యం చెప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కలబుర్గిలోని జీవర్గి రోడ్డులోగల ఉర్దూ హైస్కూలుకు 10 మంది విద్యార్థినులు హిజాబ్‌తోనే తరగతులకు వచ్చారు. కోర్టు ఉత్తర్వులు పాటించాలన్న ఉపాధ్యాయుల ఒత్తిడి మేరకు కొందరు విద్యార్థులు హిజాబ్‌లు తొలగించి ప్రీ-ఫైనల్ పరీక్షల్లో పాల్గొన్నారు.
పనికారాని వ్యవహారం : నితీశ్ కుమార్
హిజాబ్ వివాదం బీహార్‌నూ తాకింది. చినికి చినికి గాలివానగా మారకముందే సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. ప్రజల మతపరమైన మనోభావాల్ని గౌరవిస్తామని, విద్యార్థినులు హిజాబ్ ధరిస్తే..దానిపై కామెంట్ చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం..పనికిరాని వ్యవహారమని, ఇలాంటివి పట్టించుకోమని అన్నారు. పాఠశాలల్లో పిల్లలంతా ఒకటేనని, తలపై ఏదైనా ధరిస్తే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. మతపరమైన సెంటిమెంట్లు గౌరవిస్తామన్నారు.