Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకులు సుమారు రెండు దశాబ్ధాలుగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని వివరించారు. దీర్ఘకాలంగా పనిచేస్తూ ఎంతో అనుభవం ఉండి, అతితక్కువ వేతనంతో ఇప్పటికే ఉద్యోగ విరమణ వయస్సు దగ్గరపడుతున్న వారున్నారని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు 58 నుంచి 61 ఏండ్లకు పెంచినట్టుగానే వారికీ పెంచి అమలు చేయాలని కోరారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన మరో లేఖ రాశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామంటూ 2016, ఫిబ్రవరి 26న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని గుర్తు చేశారు. కానీ హైకోర్టులో పిల్ కారణంగా మధ్యంతర ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిందని తెలిపారు. ఆ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు 2021, డిసెంబర్ ఏడున రద్దు చేసిందని వివరించారు. ఈ అంశాన్ని పరిశీలించి రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసులను 16 జీవో ప్రకారం క్రమబద్ధీకరించేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.