Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రం పవన్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు కేక్కటింగ్తోపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం జీవిత చరిత్ర, ఉద్యమ నేపథ్యంతో త్రీడీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్‌తో రూపొందించిన హిందీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని వివరించారు. సీఎం ఉద్యమ చరిత్ర, సంక్షేమ పాలనకు సంబంధించి డిజిటల్ ఫొటో బూత్ డిస్ప్లే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సర్వమత ప్రార్థనలుంటాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయుష్షు హోమం, చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మంత్రి తలసాని పాల్గొంటారని తెలిపారు. దాతల సహకారంతో చేయించిన బంగారు పాదాలు, జడ, కాసుల పేరును అమ్మవారికి సమర్పిస్తారని పేర్కొన్నారు. అమీర్‌పేటలో గురుద్వార్‌లో హార్దస్ నిర్వహిస్తామని వివరించారు. నాంపల్లిలోని దర్గాలో చాదర్ సమర్పిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో జరిగే కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మెన్లు, నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.