Authorization
Tue April 01, 2025 08:49:56 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ బానిసలుగా మారారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోకాళ్ల మీద నడిచినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. ఓటమిభయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను పట్టుకున్నాడనీ, పీకేకాదుగదా ఇంకెవ్వరు వచ్చినా కేసీఆర్‌ను గెలిపించలేరని చెప్పారు. సలహాదారులు కాదు చరిత్రను మార్చేది ప్రజలేనన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. దళితులకిచ్చిన హామీలను అమలు చేస్తేనే కేసీఆర్‌కు భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. క్యాబినెట్లో ఒక్కటే మంత్రి పదవి ఇచ్చి దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. సగానికి పైగా జనాభా ఉన్న ఓబీసీలకు మూడే మంత్రి పదవులేంటని ప్రశ్నించారు. కేసీఆర్ గంటలతరబడి ప్రెస్మీట్లకు కారణం హుజురాబాద్ ఓటమేనన్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులను సీఎం కేసీఆర్ నిలువునా మోసగించారని తెలిపారు. దళిత బస్తీల్లో కరెంటు కట్ చేస్తున్నారనీ, జీరో డిపాజిట్ స్థానంలో డిపాజిట్ వసూలు చేయటం దుర్మార్గమని అన్నారు.