Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపరిహారం ఇవ్వకుండానే..
- సుద్ధకుంట మత్తడికి గండిపెడుతున్న వైనం
- అడ్డుకున్న ఆయకట్టు రైతులు
నవతెలంగాణ-గణపురం
రైతుల భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే భూముల్లో సింగరేణి అధికారుల దౌర్జన్యంగా పనులు చేస్తూ రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సుద్ధకుంట మత్తడికి గండి పెడుతుండగా రైతులు పనులను అడ్డుకున్న సంఘటన బుధవారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.... గణపురం మండలం నగరంపల్లి, కొండంపల్లి గ్రామాల భూములు సింగరేణి ఓసీ-3లో పోయాయి. కాగా రెండు గ్రామాల మధ్య సుద్ధకుంట ఉంది. దీని కింద 110 ఎకరాల ఆయకట్టు అధికారికంగా సాగవుతుండగా, అనధికారికంగా మరో 40 ఎకరాలు సాగవుతోంది. సుద్ధకుంట ఆనుకొని ఓసీ-3 మట్టి పోయడంతో కుంట పూర్తిగా కూడుకుపోయింది. దాంతో ఆయకట్టు రైతులు పలుసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కాగా ఓసీ-3 అధికారులు భూములను తీసుకుంటాం, నష్టపరిహారం చెల్లిస్తామంటూ హామీనిచ్చి విస్మరించడంతో సుద్ధకుంట ఆయకట్టు రైతులు యాసంగి పంటకు 40 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓసీ అధికారులు సుద్ధ కుంట మత్తడికి గండి పెట్టేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న ఆయకట్టు రైతులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకొని ధర్నా చేశారు. తమ భూములకు నష్టపరిహారం ఇచ్చేదాకా కుంటను ముట్టుకోవద్దని డిమాండ్ చేశారు. సుద్ధ కుంటకు 100 మీటర్ల దూరంలో ఓసీ-3 మట్టి పోస్తామని చెప్పి గుట్టలు గుట్టలుగా కుంటకు ఆనుకుని పోయడంతో కుంట పూర్తిగా కూడుకుపోయిందని వాపోయారు. తమకు నష్టపరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
రైతులను మోసం చేస్తున్న సింగరేణి -భూక్య రాజు రైతు
సింగరేణి ఓసీ-త్రీ అధికారులు రైతులను మోసం చేస్తున్నారు. కుంట వెనుక ఉన్న భూములను తీసుకుంటామని చెప్పి సర్వే చేసి ఇప్పటివరకు తీసుకోలేదు. భూములకు నష్టపరిహారం చెల్లించకుండానే కుంటను ఎలా పుడ్చుతారు. సింగరేణి ఓసీ-3 ముందు రైతులం ఏకమై పెద్దఎత్తున నిరాహార దీక్షలు చేస్తాం. నష్టపరిహారం చెల్లించాకే పనులు మొదలు పెట్టాలి.
సింగరేణి అధికారుల దౌర్జన్యం మానుకోవాలి - రాసపెల్లి కుమార్, రైతు
సింగరేణి అధికారులు దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపో తున్నాయి. కన్నతల్లి లాంటి భూములను తీసుకుంటామని చెప్పి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నష్ట పరిహారం ఇవ్వకుండానే కుంటకు గండి పెట్టడం సరికాదు. ఇలాగే చేస్తే మేం ఆత్మహత్యలు చేసుకుంటాం.