Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేరే కులం వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో..
- కూతురును హతమార్చిన తల్లి
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ శంకర్ రాజు
- 24 గంటల్లోనే కేసు ఛేదింపు
నవతెలంగాణ జహీరాబాద్
గ్రామంలోని వేరే కులం యువకునితో ప్రేమలో ఉన్న కూతురికి నచ్చజెప్పినా వినకపోవడంతో.. ఓ వ్యక్తితో కలిసి తల్లే తన కూతుర్ని హత్య చేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఈ నెల 14న జరిగిన మైనర్ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోపే ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శంకర్ రాజు వెల్లడించారు. హూగ్గేల్లి గ్రామానికి చెందిన బాలిక(17) గ్రామంలోని అక్సర్ అనే యువకున్ని ప్రేమించింది. ఈ విషయమై తల్లి బుజ్జమ్మ తను సహజీవనం చేస్తున్న కాసింపూర్ గ్రామానికి చెందిన గొల్ల నరసింహులుతో కలిసి పలుమార్లు మందలించింది. అయినా కూతురు మాట వినకపోగా తమ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చవద్దని నర్సింలును హెచ్చరించింది. దాంతో కక్ష పెంచుకున్న వీరిద్దరూ మౌనికను హత్య చేయాలని నెల రోజుల నుంచే పధకం పన్నారు. అందులో భాగంగానే ఈనెల 14న తల్లి బుజ్జమ్మ, నర్సింలు కలిసి మౌనికను చున్నీతో ఉరివేసి హత్య చేశారు. అనంతరం గ్రామ శివారులోని మామిడితోటలో మృతదేహాన్ని పడేసి కూతురు కనిపించడం లేదని తల్లి బుజ్జమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక అక్సర్ హత్య చేసినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మూడు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో తల్లి బుజ్జమ్మ, నర్సింలే మౌనికను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే మైనర్‌పై ఎలాంటి లైంగికదాడి జరగలేదనీ, ఈ హత్యలో అక్సర్‌కు ఎలాంటి ప్రమేయం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు ఛేదింపునకు నియోజకవర్గంలోని సీఐ రాజశేఖర్ కృషి అభినందనీయమని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐలు శ్రీకాంత్, రవి గౌడ్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.