Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్త్రీల వస్త్రధారణపై రాజకీయాలు ఆపాలి
- ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత
నవతెలంగాణ-విద్యానగర్
స్త్రీల వస్త్రధారణపై రాజకీయాలు ఆపాలని.. వారికి స్వేచ్ఛ కల్పించాలని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ, ఆవాజ్ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశంలో ఇటీవల చర్చనీయాంశమైన హిజాబ్ వివాదంపై చర్చించారు. విద్యాలయాల్లో మత రాజకీయాలు ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు. యువతుల ప్రాథమిక హక్కును కాలరాసే చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత మాట్లాడుతూ.. హిజాబ్ సాకుతో ముస్లిం మహిళల విద్యాహక్కును హరించడం అన్యాయమని, ఏం ధరించాలో ఆమె నిర్ణయించుకుంటుందని అన్నారు. విద్యాలయాల్లో మత రాజకీయాలు ఆపాలని డిమాండ్ చేశారు. ముస్లిం యువతులు ధరించే హిజాబ్‌ను సాకుగా చూపి బీజేపీ హిందూత్వ శక్తులు కర్నాటకలో మరోసారి ముస్లిం వ్యతిరేక ధోరణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక విద్యాశాఖ నూతనంగా జారీ చేసిన సర్క్యులర్ల ఆధారంగా ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో బాలికల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని అఖిల భారత విద్యార్థి పరిషత్, హిందూ జాగరణ్ వేదికలు వివాదాస్పదం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది కాషాయ తలపాగలు పెట్టుకుని కళాశాల గేటు వద్ద నిరసన తెలపడాన్ని ఖండించారు. హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను విద్యకు దూరం చేస్తున్న ఈ చర్య వెనుక.. కర్నాటక ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజాస్వామిక దేశాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారన్నారు. కళాశాలలో మతపరమైన విభజనను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వస్త్రధారణపై ఆంక్షలు విధించకుండా స్త్రీలకు స్వేచ్ఛ కల్పించాల్సిందిగా ప్రభుత్వాలను కోరారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మయూరిఖాన్, సహాయ కార్యదర్శి కె.లలిత, కోశాధికారి మంజుల, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట కపిల్, ఆత్రం నగేశ్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి మసిఉల్లాఖాన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి పూసం సచిన్, సురేందర్ పాల్గొన్నారు.