Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలి
- సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-కేతెపల్లి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించే వరకు ప్రజల్లోకి వెళ్లి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీపీఐ(ఎం) సమావేశం అనంతరం విలేకర్ల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు.
కాషాయ దేశంగా మార్చాలని మోడీ ప్రయత్నిస్తున్నారని, మతతత్వ పార్టీ బీజేపీని గద్దె దింపాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. మతాల పేరిట దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోందన్నారు. ప్రమాదకరమైన బీజేపీని రాబోయే ఎన్నికల్లో ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. దీనికోసం ఎర్రజెండా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి ప్రజలను చైతన్యపర్చాలన్నారు. రాజ్యాంగంలోని లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాష్ట్రాలకు అధికారం వంటి నాలుగు మూల స్తంభాలను ధ్వంసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని, నయా ఉదారవాద విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజల చేత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెప్పడం సరైంది కాదన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవిష్యత్తులో గ్రామస్థాయి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా వచ్చే పన్నులను రాష్ట్రాలకు పంచకుండా కేంద్రమే నేరుగా తీసుకుంటోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేసే యోచనలో ఉన్నారన్నారు. ఈ విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా పోరాడాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు గతంలో పట్టాలు ఇస్తానని హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. పోడు భూముల పట్టాలు ఇచ్చి కేసీిఆర్ తమ మాటపై నిలబడాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.