Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కువ ధర లభించడంతో రైతుల మొగ్గు
- పంట రాక బోసిపోతున్న జిల్లా మార్కెట్లు
- పది రోజుల్లో వచ్చింది 2వేల క్వింటాళ్లే..
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మన పంట మహారాష్ట్రకు తరలిపోతోంది. పత్తి పంట లాగే.. కంది పంట కూడా అటే పోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పండించిన కంది పంటను రైతులు పొరుగు రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా మార్కెట్లలో మద్దతు ధర తక్కువగా ఉండటం.. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండటంతో అనేక గ్రామాల రైతులు మహారాష్ట్రలో అమ్మడానికే మొగ్గుచూపుతున్నారు. ధర ఎక్కువగా ఉన్న చోట్ల విక్రయించేందుకు అవకాశం ఉండటంతో సరిహద్దు గ్రామాల రైతులతో పాటు పెద్ద మొత్తంలో కంది పంట సాగుచేసిన అన్నదాతలు పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు కొనుగోళ్లు లేక బోసిపోతున్నాయి. కందుల కొనుగోళ్లు ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సుమారు 2వేల క్వింటాళ్ల వరకు మాత్రమే మార్కెట్లకు పంట వచ్చింది. ఎనిమిది మార్కెట్లలో నామమాత్రపు కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. రోజులో కనీసం ఒకట్రెండు క్వింటాళ్లు కూడా రావడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.20లక్షల ఎకరాల్లో కంది పంటను సాగుచేశారు. ఎకరానికి కనీసం 6క్వింటాళ్ల చొప్పున దిగుబడి రాగా.. సుమారు 7లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6300గా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాలు ఉండగా.. ఇందులో 12 కేంద్రాల్లో కందుల కొనుగోళ్లు ప్రారంభించారు. కానీ ప్రభుత్వ మద్దతు ధర కంటే బయటి మార్కెట్లో కందులకు ఎక్కువ ధర పలుకుతుండటంతో రైతులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో జిల్లాలోని మార్కెట్లలో కందుల కొనుగోళ్లు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వాసులకు మహారాష్ట్ర ప్రాంతం దగ్గరగా ఉండటం.. అక్కడి మార్కెట్లలో క్వింటాల్‌కు రూ.7వేల వరకు ధర ఉండటంతో అనేక మంది రైతులు పొరుగు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. మరికొందరు చిన్న రైతులు గ్రామాల్లోనే దళారులకు వియ్రిస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్తే ఆర్థికభారం అవుతుందనే ఉద్దేశంతో గ్రామాలకు వచ్చిన వారికి కందులు విక్రయిస్తున్నారు.