Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- లేకుంటే తీవ్ర చర్యలంటూ హెచ్చరిక
- 'యోగికి ఓటెయ్యకపోతే బుల్డొజర్లతో తొక్కిస్తాం'
అన్న వ్యాఖ్యలపై గరం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 'బీజేపీకి ఓటెయ్యనివారిని గుర్తించి బుల్డోజర్లతో యోగి తొక్కిస్తారు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌కు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) నోటీసులు జారీ చేసింది. భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని నిబంధనలను కాలరాస్తూ రాజాసింగ్ ఓటర్లను భయపెడుతూ చేసిన ప్రసంగం తాలూకూ వీడియోలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేకుంటే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది. నిర్ణీత గడువులోగా 'మీ వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోతే, ఈ విషయంలో మీరు ఏమీ చెప్పలేదని భావించాల్సి వస్తుంది. తదుపరి చర్యలకు పూనుకుంటాం' అని నోటీసులో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123లోని సబ్‌సెక్షన్-2 ప్రకారం ఎన్నికల సమయంలో ఓటర్లను భయపెట్టడం చట్టరీత్యా నేరమనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి భిన్నంగా 'యూపీలో వేల సంఖ్యలో జేసీబీలను, బుల్డోజర్లను యోగి తెప్పించారు. ఎన్నికల తర్వాత యోగీకి మద్దతివ్వని వారిని అన్ని ప్రాంతాల్లో గుర్తిస్తాం. జేసీబీ, బుల్డోజర్ ఎందుకు వస్తాయో మీకు తెలుసు కదా?' అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.