Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖకు ప్రొఫెసర్ కాశీం అధ్యక్షులుగా(హెడ్) నియమితులయ్యారు. వందేండ్ల చరిత్రలో మొదటిసారి దళిత ప్రొఫెసర్‌కు ఈ అవకాశం దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ కాశీం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం, అంబటిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఎన్నో కష్టాలకు ఓర్చి చదువుకుని, ఉద్యోగం సంపాదించి ఈ స్థాయికి చేరారు. ఆయన బాల్యంలో పదేండ్ల వరకు పశువుల కాపరిగా ఉంటూ రాత్రి బడిలో చదువుకున్నారు. తరువాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లింగాలలో పదో తరగతి పూర్తి చేసుకున్నారు. హత్నూర్ గురుకుల జూనియర్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ప్రతిష్టాత్మకమైన నిజాం కాలేజ్‌లో డిగ్రీ చదివారు. ఎంఫిల్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ డిగ్రీ పొందారు. రెండేండ్లపాటు తెలుగు శాఖకు చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రొఫెసర్ కాశీం కవిగా, రచయితగా, విమర్శకుడిగా, వక్తగా, పరిశోధకుడిగా, సామాజిక సాహిత్య ఉద్యమాల సారథిగా, అంబేద్కరిస్టుగా.. సామాజిక బాధ్యత కలిగిన ప్రొఫెసర్‌గా అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేశారు. నాణ్యమైన బోధన, పరిశోధన కలనేతగా సాగుతున్న సాహిత్య బాటసారికి ఈ అవకాశం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పలువురు అధ్యాపకులు, ప్రొ. కాశీంను సత్కరించారు. పలువురు ప్రముఖులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. వర్సిటీ తెలుగ శాఖ ఉన్నతికి పాటుపడాతనని ప్రొ. కాశీం అన్నారు.