Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనరేట్ల ముందు ధర్నాకు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు
- అరెస్టులను ఖండించిన రేవంత్‌రెడ్డి
- అసోం సీఎంపై కేసు నమోదు చేయాల్సిందే...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. కానీ ఎక్కడా కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అందులో పేర్కొన్న సెక్షన్లు అవి న్యాయబద్ధంగా లేవని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో అన్ని పోలీస్ కమిషనరేట్లను ముట్టడి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా హౌస్అరెస్టులు చేశారు. రేవంత్‌తోపాటు ఎంపీ కోమటిరెడ్డి వెంటకరెడ్డి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. కానీ తెల్లవారుజామున్నే రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఆయన్ను బయటకు రాకుండా భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, మల్లురవి, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులను గృహ నిర్బంధం చేశారు. అంతకు ముందు ఎన్ఎస్యూఐ నాయకులు హైదరాబాద్ పోలీస్‌కమిషనరేట్ ముట్టడికి యత్నించారు. వారిని అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారి అరెస్టు చేసి గోషామల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. మహిళలను కించపరిచేలా వ్యవహరించిన అస్సాం సీఎంపై బలమైన కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు నమోదు చేసిన సెక్షన్లు సంతృప్తికరంగా లేవన్నారు. అందుకే మళ్లీ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 'ఆపరేషన్ సక్సెస్ బట్ పేషేంట్ డెడ్' అన్నట్టుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడిమేరకే నామమాత్రపు కేసులు నమోదు చేశారని విమర్శించారు. మహిళలను అత్యంత నీచంగా కించపరిచే విధంగా మాట్లాడిన హిమంతపై బలమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసును నీరుగారిస్తే న్యాయస్థానంలో పోరాడుతామన్నారు.
నిరుద్యోగులు చనిపోతుంటే...సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలా? : రేవంత్
ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు చనిపోతుంటే, పుట్టిన రోజు వేడుకలు ఎలా చేసుకుంటారని సీఎం కేసీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. కరోనా వైరస్‌తో ప్రజలంతా ద్ణుఖంలో ఉంటే పుట్టిన రోజులు జరుపుకోవడంలో ఉద్దేశమేంటని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసేందుకు వెళుతున్న పర్యటనలు ఉద్దర ప్రయాసేనన్నారు. గతంలో కూడా ఇలాంటి పర్యటనలు చేశారు కానీ ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. తన పర్యటనతో కాంగ్రెస్‌ను బలహీన పరిచి బీజేపీకి మేలు చేసేలా కేసీఆర్ ఎజెండా ఉందన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మతిభ్రమించింది : మెట్టుసాయి
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మతిభ్రమించిందనీ, అందుకే బీజేపీకి ఓట్లేయని వారి ఇండ్లను బల్డోజర్లతో కూల్చివేస్తామంటూ ప్రకటించారని టీపీసీసీ ఫిషర్‌మేన్ రాష్ట్ర చైర్మెన్ మెట్టుసాయికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బీజేపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. యూపీలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే ఓటర్లను భయాందోళనలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వారి నేతల తాటకు చప్పుళ్లకు ప్రజలు భయపడబోరని తెలిపారు.