Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4.09 నుంచి 1.10 శాతానికి
- కొత్త కేసుల కన్నా కోలుకుంటున్న వారు నాలుగు రెట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా థర్డ్ వేవ్ ముగిసింది. 20 రోజుల వ్యవధిలో పాజిటివ్ రేటు మూడు శాతం తగ్గింది. మూడో దశలో అత్యధికంగా జనవరి 23న 4.09 శాతం పాజిటివ్ రేటు నమోదైన సంగతి తెలిసిందే. ఆ రోజు అత్యధికంగా 4,393 కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజాగా పాజిటివ్ రేటు రోజు వారీగా సగటున 1.10 శాతం ఉంటున్నది. తాజాగా మంగళవారం 569 కొత్త కేసులు రాగా కోలుకున్న వారి సంఖ్య అంతకు నాలుగు రెట్లు 2,098గా ఉన్నది. ఆస్పత్రుల్లోనూ చికిత్స పొందే రోగుల సంఖ్య జనవరి 23 నాటికి 3,337 మంది ఉంటే అది కాస్తా 1,426కు తగ్గింది. యాక్టివ్ కేసుల 33,673 నుంచి 8,379కి దిగాయి. రాబోయే కాలంలో ఇవి మరింత తగ్గుతాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. మరో వేరియంట్ వచ్చే అవకాశం లేదనీ, ఇక భవిష్యత్తులో కరోనా పాండమిక్ నుంచి ఎండమిక్ (కొన్ని ప్రాంతాలకు, కొన్ని సీజన్లకు పరిమితం) అయి ఫ్లూ మాదిరిగా మారుతుందని చెబుతున్నారు. మరి కొన్ని వారాల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
512 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 512 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 46,168 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 1,463 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,673 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 125 మందికి కరోనా సోకింది. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 1,351మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 1.10 శాతంగా నమోదయింది.