Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగంతోనే విద్యార్థులు బయటికెళ్లాలి
- శిక్షణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి
- భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
- పరిశోధనలు పెంచి పరిశ్రమలతో
అనుసంధానం చేసుకోవాలి :
- వీసీల సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మానవ వనరులను అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయాలు కీలకపాత్ర పోషించాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వర్సిటీల్లో చదివే విద్యార్థులు ఉద్యోగంతోనే బయటికెళ్లేలా కరికులమ్ రూపొందించాలనీ, నాణ్యమైన విద్యను అందించాలని ఉపకులపతుల (వీసీ)ను ఆమె ఆదేశించారు. విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి అవకాశాల కోసం బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు అచంచలమైన ఆత్మ విశ్వాసాన్ని విద్యార్థులు కలిగి ఉండేలా బోధన జరగాలని ఆకాంక్షించారు. చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్న నమ్మకాన్ని కల్పించాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వీసీల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ లక్ష్యాన్ని సాధించాలన్న ఖచ్చితమైన సంకల్పాన్ని, అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో కల్పించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాల అధ్యాపకులదేనని చెప్పారు. వర్సిటీల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వివరించారు. విద్య, పరిశోధన, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే బాధ్యతలను విశ్వ విద్యాలయాలు విస్మరించొద్దని కోరారు. వర్సిటీల్లో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలనీ, అవే ఆయా విశ్వవిద్యాలయాలకు కొలమానంగా నిలుస్తున్నాయని అన్నారు. పరిశోధన అనుభవం నాణ్యమైన బోధనకు దారితీస్తుందనీ, ఉన్నత విద్యాభ్యాసాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. భవిష్యత్ సమాజంపై ప్రభావాన్ని చూపే రంగాలను గుర్తించి ఆయా కోర్సులను రూపొందించుకోవాలనీ, ఆయా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ముఖ్యమైన పరిశోధనలకు నాయకత్వం వహించడానికి శాస్త్రీయ సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో విశ్వ విద్యాలయాలు సరైన నెట్వర్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మెరుగైన, నాణ్యమైన ఉత్పత్తులను సాధించడానికి అవసరమైన మార్గాలను అన్వేషించాలనీ, తద్వారా భారతీయ పరిశ్రమలకు సహకరించాలని చెప్పారు. అధునాతనమైన పరిశోధనలు చేపట్టడానికి అవకాశాలను కల్పించడంతోపాటు నిర్ధిష్టమైన రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా విశ్వవిద్యాలయాలు రూపొందాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల మీద విశ్వవిద్యాలయాల పరిధిలోని పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఒక్కో వర్సిటీలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని సత్ఫలితాలు సాధించాలని కోరారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, ఉద్యోగావకాశాలకు కావాల్సిన శిక్షణను ఇవ్వడానికి వర్సిటీల స్థాయిల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే పోటీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నందున వర్సిటీల్లోని విద్యార్థులు సిద్ధమయ్యేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకయ్యే నిధులను ప్రభుత్వం వెంటనే అందజేస్తుందని వివరించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు ఉత్తమ వర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీసీలతోకూడిన కమిటీని వేసి నివేదిక రూపొందిస్తామని చెప్పారు. విద్యా సంబంధిత పరిశ్రమలు నెలకొనే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌తోపాటు వీసీలు పాల్గొన్నారు. వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కావాలని మంత్రి సబితను వీసీలు కోరారు.
ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిన సబిత
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ సహకారంతో ఈ-ఆఫీస్ అప్లికేషన్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఐటీఈ అండ్ సీ జాయింట్ డైరెక్టర్ పెండ్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.